కంసుని చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని యమున మధ్యలోనుంచి నడుచుకుని వెళతాడు వసుదేవుడు. శ్రీకృష్ణుని కథలో ఇది చాలా ముఖ్యమైన కథనం. అచ్చు అలాగే ఓ తండ్రి తన బిడ్డని బుట్టలో మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. అతడిని చూసిన నెటిజన్లు శ్రీకృష్ణుని కథనే గుర్తుకుతెచ్చుకుంటున్నారు. అసోంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వరదలతో రోడ్లు నిండిపోయాయి. ఈ పరిస్థితిలో సిలిచార్ పట్టణంలో ఒక మహిళ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. మంచి ముహుర్తం చూసి ఆ బిడ్డను ఇంటికి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసింది కుటుంబం. కానీ వారి ఇళ్లున్న ప్రాంతమంతా వరదలే. నడుము లోతు నీళ్లతో నిండిపోయింది.


వసుదేవుడిలా మోసుకొచ్చి...
శ్రీకృష్ణుడిని మోసుకుంటూ యమునా నదిని దాటుతున్న వసుదేవుడిలా ఆ తండ్రి బుట్టలో తన చిన్నారిని ఇంటికి మోసుకొస్తుంటే... చుట్టూ ఉన్న వారు స్వాగతం పలికారు. అంత వరద నీటిలో కూడా బిడ్డను మోసుకొస్తూ తండ్రి ముఖంపై చిరునవ్వు మాత్రం చెరగలేదు. అదే కదా తండ్రి ప్రేమంటే. ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా బిడ్డల్ని చూసి మురిసిపోయే తండ్రులకు రోజూ ఫాదర్స్ డేనే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


అసోంలో కొన్ని రోజుల నుంచి వానలు దంచి కొడుతున్నాయి. దీని వల్ల చాలా ఊళ్లలో వరదలు పొంగి పొర్లుతున్నాయి. వేల ఇళ్లలోకి నీరు చొచ్చుకుని వెళ్లిపోయిది. ఇప్పుడు వైరల్ అయిన ఈ వీడియోలోని తండ్రి ఇంట్లోకి కూడా నడుము లోతు నీళ్లు ఉన్నాయి. పుట్టిన బిడ్డని మొదటి అంతస్థులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. 





Also read: భర్త చనిపోయిన రెండేళ్లకు అతని బిడ్డకు జన్మనిచ్చిన భార్య


Also read: మగవారిలో కోరికలు పెంచే హార్మోన్ టెస్టొస్టెరాన్, అది తగ్గితే కనిపించే లక్షణాలు ఇవే