Nagarjuna University Results : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ విడుదల చేశారు. ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్ హిస్టరీ, సోషల్, ఎమ్.కాం ఫలితాలు విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జులై 7గా నిర్ణయించారు. 


2021 పీజీ ఫలితాలు 


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం సెమిస్టర్ ఫలితాలు విడుదల అయ్యాయి. నాగార్జున వర్సిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన 2021 బ్యాచ్‌ పీజీ జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌, తెలుగు, ఎకనామిక్స్‌, హిస్టరీ, సోషల్‌ వర్క్‌, హిందీ, సంస్కృతం, సోషియాలజీ, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్మెంట్‌, ఎంకామ్‌, ఎంఎల్‌ఐ ఎస్‌సీ, బిఎల్‌ఐ ఎస్‌సి కోర్సుల పరీక్ష ఫలితాలను బుధవారం అదనపు వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్‌ విడుదల చేశారు.


జులై 7 వరకు గడువు 


ఈ ఫలితాలపై ఏమైన సందేహాలు ఉంటే విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. రీవాల్యుయేషన్ కు జూలై 7వ  తేదీని గడువుగా నిర్ణయించాయి. ఒక్కొక్క పేపర్‌ రీవాల్యుయేషన్‌ ఫీజుగా రూ. 960 చెల్లించాల్సి ఉంటుంది. రీ వాల్యుయేషన్‌ దరఖాస్తులను జులై 9వ తేదీ లోపు విశ్వవిద్యాలయంలోని దూరవిద్య పరీక్షల సమన్వయకర్తకు అందజేయాలని డిప్యూటీ రిజిస్ట్రార్ నంబూరు యోబు తెలిపారు. ఫలితాలను ఏఎన్‌యూ సీడీఈ డాట్‌ ఇన్ఫో నుంచి తెలుసుకోవచ్చని డిప్యూటీ రిజిస్ట్రార్ సూచించారు.


ఏఎన్‌యూలో  ఉర్దు కోర్సు 


రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముస్లిం సంఘాల వినతులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టింది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాను కలిసి వినతి పత్రాలు అందజేయగా ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్‌యూ ఉన్నతాధికారులు స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూలో ఉర్దూ కోర్సు ప్రారంభిస్తామన్నారు. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా చర్యలు పూర్తి చేశారు. 


ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేయాలని ముస్లిం జేఏసీ నాయకులు కోరారు. ఈ శాఖలో అరబిక్‌ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.