ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పారిస్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు ఆయన పారిస్‌లో పర్యటిస్తారు. దీనికి సీబీఐ కోర్టు అనుమంతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
జగన్ పదే పదే ఏదో వంకతో ఫారిన్ టూర్లకు వెళ్తున్నారని... దీని వల్ల జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని సీబీఐ వాదించింది. మొన్నటికి మొన్న దావోస్ వెళ్లొచ్చారని... ఇప్పుడు మరో దేశం వెళ్తానంటే ఎలా అంటూ జగన్ టూర్‌పై అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ టూర్‌కు లైన్ క్లియర్ చేసింది. పారిస్ టూర్ వివరాలు సీబీఐకి, కోర్టుకు అందజేసి వెళ్లాల్సిందిగా జగన్‌ను ఆదేశించింది. టూర్‌ను అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ వాదనను తోసిపుచ్చింది.
సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. ఆమె జులై 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. దీనికి సీఎం జగన్ హాజరు కానున్నారు. అందుకే సీబీఐ కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులు సడలించాలని వేడుకున్నారు. జూన్ 28 నుంచి పదిరోజుల పాటు పారిస్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనిపై సీబీఐ అభ్యంతరం చెప్పినా... ప్రత్యేక న్యాయస్థానం జగన్ ఫారిన్ టూర్‌కు పచ్చజెండా ఊపింది.
హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో కుటుంబ పర్యటనలో వారిద్దరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు జగన్ కుమార్తె ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు.