Israel Gaza War:
హమాస్‌ని చుట్టు ముట్టిన సైన్యం..
Gaza News: గాజాపై ఇజ్రాయేల్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. పూర్తిస్థాయిలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయేల్ సైన్యం అన్ని వైపుల నుంచీ హమాస్ ఉగ్రవాదుల్ని (Hamas Attack) చుట్టు ముడుతోంది. ఈ దాడుల ధాటిని తట్టుకోలేక పాలస్తీనా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అక్కడ ఉండడం కన్నా వెళ్లిపోవడం మంచిదనుకుని క్రమంగా ఊరు దాటుతున్నారు. నార్త్ గాజా నుంచి (Palestine People Flee) వేలాది మంది పాలస్తీనా పౌరులు వెళ్లిపోతున్నారు. వీళ్లలో వృద్ధులు, మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నట్టు CNN వెల్లడించింది. Israel Defense Forces ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. అందరూ ఊరు వదిలేసి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది. దాదాపు 5 రోజులుగా ఇదే పనిలో నిమగ్నమైంది. ఈ ఐదు రోజుల్లో అక్కడి నుంచి వెళ్లిపోయిన వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాజాలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో తమ సైన్యం పట్టు సాధిస్తోందని (Israel Gaza War) ఇజ్రాయేల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గలాంట్ స్పష్టం చేశారు. హమాస్‌కి సంబంధించిన అన్ని స్థావరాలపైనా దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు పాలస్తీనా పౌరులను ఊరొదిలి వెళ్లిపోవాలని సూచించారు. ఈ మేరకు గాజాలోని రెండు జాతీయ రహదారులను తెరిచారు. వీటితో పాటు మరో కారిడార్‌నీ తెరిచారు. ఆ దారుల్లోనే పాలస్తీనా పౌరులు వెళ్లిపోతున్నారు. అయితే...ఇజ్రాయేల్ సైన్యంపై వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇజ్రాయేల్ మాత్రం తమ వాదన వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెర్రిరిస్ట్ స్పాట్ గాజాయేనని స్పష్టం చేస్తోంది.
అండర్ గ్రౌండ్‌లో టన్నెల్స్..
గాజాలో అండర్ గ్రౌండ్‌లో కిలోమీటర్ల కొద్దీ సొరంగాలు నిర్మించారు హమాస్ ఉగ్రవాదులు. ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యం వీటినే టార్గెట్ చేసింది. ఈ టన్నెల్స్‌లో కొన్ని హాస్పిటల్స్‌కి, మరి కొన్ని స్కూల్స్‌కి వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారు. సులువుగా తప్పించుకోడానికే కాకుండా దాడులు చేయడానికీ అనుకూలంగా నిర్మించుకున్నారు. వీటన్నింటినీ ధ్వంసం చేయాలన్నదే ఇజ్రాయేల్ లక్ష్యం. ఈ కారణంగానే అక్కడి పౌరులు భయంతో వేరే చోటకు వెళ్లిపోతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం నవంబర్ 5వ తేదీన 2 వేల మంది పౌరులు వలస వెళ్లగా...నవంబర్ 7వ తేదీ నాటికి 15 వేలకు పెరిగింది. తమ జీవితంలో ఇంత కన్నా దారుణమైన పరిస్థిలు ఇకపై చూస్తామో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మాత్రం యుద్ధం ముగిసిన తరవాతే అక్కడి ప్రజల భద్రత గురించి పూర్తిగా ఆలోచిస్తామని స్పష్టం చేశారు. యుద్ధానికి కాస్త విరామం ఇవ్వాలని అమెరికా కోరినప్పటికీ అందుకు నెతన్యాహు అంగీకరించడం లేదు. అక్కడి పౌరుల భద్రత తమ బాధ్యతేనని వివరించారు. గాజాని ఆక్రమించుకోవడం ఇజ్రాయేల్‌కే మంచిది కాదని అమెరికా సున్నితంగా మందలించింది. అయినా నెతన్యాహు మాత్రం పంతం వీడడంలేదు.
Also Read: Gaza News: ఇజ్రాయేల్ మహిళా పోలీస్ దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన 16 ఏళ్ల పాలస్తీనా ఉగ్రవాది!