Israel Palestine Attack:


ఇజ్రాయేల్ పోలీస్‌ హత్య..


Gaza News: జెరూసలేంలో ఇజ్రాయేల్‌ మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ హత్యకు గురైంది. ఓ 16 ఏళ్ల పాలస్తీనా బాలుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తరవాత పోలీసులు ఆ బాలుడిని కాల్చి చంపారు. ఈ దాడిలో ఓ మరో పోలీస్‌కీ గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులుగా ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం (Israel Hamas War) కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హత్య సంచలనం సృష్టించింది. జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో ప్యాట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో బాలుడు దాడి చేసినట్టు Wall Street Journal వెల్లడించింది. కత్తితో పొడవడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించినప్పటికీ అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోయింది. 2021లో అమెరికా నుంచి ఇజ్రాయేల్‌కి వలస వచ్చింది మహిళా పోలీస్ ఆఫీసర్. 2022లో  Israel Border Policeలో జాయిన్ అయింది. కుటుంబానికి దూరంగా ఇజ్రాయేల్‌లో ఒంటరిగా ఉంటోంది. డిపార్ట్‌మెంట్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆఫీసర్‌ హత్యకు గురవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. పాలస్తీనాకు చెందిన హమాస్‌ని అంతం చేసేందుకు ఇజ్రాయేల్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించింది. 


అక్టోబర్ 7 నుంచి దాడులు..


అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు (Israel Palestine War) చేశారు. అప్పటి నుంచి హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది ఇజ్రాయేల్ సైన్యం. గాజాపై (Gaza Attack) రాకెట్‌ల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్న బంకర్లపై దాడులు చేస్తోంది. ఇప్పటికే 28 మందిని అరెస్ట్ చేసింది. వాళ్లలో 11 మందికి హమాస్‌తో లింక్స్ ఉన్నట్టు గుర్తించింది. హమాస్‌కి చెందిన వేర్‌ హౌజ్‌నీ ధ్వంసం చేసింది  Israel Defense Forces (IDF). మహిళా పోలీస్ ఆఫీసర్‌ని హత్య చేసిన వ్యక్తి ఇంటినీ గుర్తించినట్టు IDF ప్రకటించింది. అక్టోబర్ 7 వ తేదీ నుంచి మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ 1,400 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 340 మంది సైనికులే ఉన్నారు. ఇక ఇజ్రాయేల్‌ యుద్ధం కారణంగా పది వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.  Gaza Health Ministry లెక్కల ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 


మ్యూజికల్ ఫెస్టివల్‌పై దాడులు..


అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు (Israel Hamas War) మొదలు పెట్టారు. ముందుగా ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై కాల్పులు జరిపారు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ సమయంలో అక్కడ పార్టీ మూడ్‌లో ఉన్న వాళ్లంతా అటూ ఇటూ పరుగులు పెట్టారు. హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా వాళ్లపై కాల్పులు జరిపారు. అక్కడ ఒక్క చోటే దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరిని కిడ్నాప్ చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. అయితే..ఆ సమయంలో ఈ దాడుల నుంచి తప్పించుకుని ఎలాగో ప్రాణాలతో బయట పడ్డ వాళ్లు ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి తేరుకోలేదు. ఆ ముప్పు నుంచి ఎలా తప్పించుకున్నారో వివరిస్తున్నారు. 


Also Read: గాజాని ఆక్రమించాలన్న ఆలోచన మానుకుంటేనే మంచిది, ఇజ్రాయేల్‌కి బైడెన్ వార్నింగ్!