Israel Palestine Attack: 


గాజాపై ఇజ్రాయేల్ దాడులు..


హమాస్ దాడులపై మరోసారి (Israel Hamas Attack) తీవ్రంగా స్పందించారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu). గాజాపై చేస్తున్న దాడులు కేవలం "ఆరంభం" మాత్రమే అని స్పష్టం చేశారు. మున్ముందు దాడుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. వేలాది మంది ఇజ్రాయేల్ బలగాలు గాజాను చుట్టుముట్టాయి. సొరంగాల్లో నక్కి ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నాయి. బంకర్లనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. రానున్న రోజుల్లో శత్రువుల మరింత భారీ మూల్యం చెల్లించుకుంటారని తేల్చి చెప్పారు. హమాస్‌ని పూర్తిగా అంతం చేస్తామని శపథం చేశారు నెతన్యాహు. 


"గాజాలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు తీవ్రత పెంచుతాం. శత్రువులు మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏం జరగనుందో ఇప్పుడే చెప్పలేను. కానీ దాడులు పెరుగుతాయన్నది మాత్రం నిజం. హమాస్ దురాగతాలను అసలు క్షమించం. జూదులపై జరిగిన ఈ దాడులను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. మా శక్తి సామర్థ్యాలకు మించి మరీ వాళ్లపై పోరాడేందుకు సిద్ధంగానే ఉన్నాం"


- బెంజిమన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని


దాదాపు 24 గంటలుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయేల్ బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ఉగ్రవాదులు ఇక్కడి నుంచే ఇజ్రాయేల్‌పై దాడులు చేశారు. అందుకే...ఈ ప్రాంతంపైనే పూర్తిగా దృష్టి సారించింది మిలిటరీ. ఇప్పటికే ప్రధాని బెంజమిన్ నెనన్యాహు యుద్ధానికి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. గాజా వద్ద దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లను ముక్కలు ముక్కలు చేసేస్తామని తేల్చి చెప్పారు. గాజాలో ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి నుంచి బయటకు వచ్చి సేఫ్‌టీ షెల్టర్‌లలో తలదాచుకోవాలని సూచించారు. ఇజ్రాయేల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆపరేషన్‌ని సహకరించాలని కోరారు. అన్ని చోట్లా వాళ్లు నక్కి ఉన్నారని...వాళ్లను నాశనం చేసేంత వరకూ ఊరుకోమని స్పష్టం చేశారు. Israel Defense Forces (IDF) కి హమాస్ ఉగ్రవాదులను నాశనం చేసే సామర్థ్యం ఉందని తేల్చి చెప్పారు నెతన్యాహు. అమాయక ప్రజల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోం అని వెల్లడించారు. కచ్చితంగా యుద్ధం చేస్తామని, గెలిచి తీరతామని అన్నారు. ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిన ఆయన...వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.


"గాజాలో చాలా చోట్ల హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. అక్కడి నుంచే దాడి చేస్తున్నారు. వాళ్లను ఎలాగైనా కనుగొంటాం. ముక్కలు ముక్కలు చేసేస్తాం. గాజా పౌరులకు నాదొకటే విజ్ఞప్తి. వెంటనే సిటీ వదిలి బయటకు వచ్చేయండి. ఇజ్రాయేల్ సైన్యం చేపడుతున్న ఆపరేషన్‌కి సహకరించండి. హమాస్ ఉగ్రవాదులు మనల్ని చంపాలని చూస్తున్నారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్లపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారు. పిల్లలన్న కనికరం కూడా లేకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు


- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని


Also Read: ఇజ్రాయేల్‌ దాడుల్లో జర్నలిస్ట్‌లు మృతి, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు