Gazans Fleeing: 


గాజా పౌరుల వలసలు..


గాజాను వదిలి వెళ్లిపోవాలంటూ అక్కడి పౌరులకు ఇజ్రాయేల్ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లోగా ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు. కానీ అక్కడే ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే..ఎలాగోలా అక్కడి నుంచి బయట పడుతున్నారు. కొన్ని కుటుంబాలు నెమ్మదిగా ఖాళీ చేస్తున్నాయి. ట్విటర్‌లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది పౌరులు కార్‌లపై సామాన్లు కట్టుకుని బయట పడుతున్నారు. పరుపులు, దుస్తులు కార్‌ రూఫ్‌కి కట్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గాజానే తమ లోకం అనుకున్న వాళ్లు ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. పాలస్తీనా మీడియా రిపోర్టర్లు కొందరు ట్విటర్‌లో ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. నార్త్ గాజాలో పరిస్థితులెలా ఉన్నాయో కళ్లకు కడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయేల్ 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను మొహరించింది. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ముందుంగానే అందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మిలిటరీ కీలక ప్రకటన కూడా చేసింది. 


"గాజా పౌరులు మీ సేఫ్‌టీ కోసమే చెబుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదుల నుంచి దూరంగా వెళ్లిపోవడం మీకే మంచిది. మిమ్మల్నే అడ్డం పెట్టుకుని వాళ్లు దాడులకు తెగబడుతున్నారు"


- ఇజ్రాయేల్ మిలిటరీ