Israeli Diplomat Stabbed: 



ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై కత్తితో దాడి..


చైనాలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఉన్నట్టుండి వచ్చి కత్తితో పొడిచాడు. ఇజ్రాయేల్ విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతానికి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. ఇప్పటికే ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరగడం సంచలనమైంది. ఇప్పటికే ప్రపంచదేశాల్లో ఉన్న ఇజ్రాయేల్ పౌరులను, జూదులను అప్రమత్తం చేశారు. దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయేల్‌ దౌత్యవేత్తపై జరిగిన దాడిని టెర్రర్ అటాక్‌గానే భావిస్తున్నారు. ఈ ఘటన తరవాత ఇజ్రాయేల్, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీజింగ్‌లోని ఇజ్రాయేల్‌ దౌత్య కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హమాస్ దాడులను ఖండించకపోగా..ఇలా దాడులు జరుగుతున్నా చైనా పట్టించుకోవడం లేదని మండి పడుతోంది. డ్రాగన్ చాలా ఉదాసీనంగా వ్యవహరించడంపై ఇప్పటికే ఇజ్రాయేల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల యుద్ధంలో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు, 1,530 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది మంది ఊరొదిలి వెళ్లిపోయారు. గాజాపై మరింత ఉద్ధృతంగా దాడులు చేసేందుకు ఇజ్రాయేల్‌ సిద్ధమవుతోంది. 


ఖాళీ చేయండి..


గాజా సరిహద్దు (Gaza Strip) వద్ద హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు (Israel Hamas Attack) కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంపై పట్టు సాధించామని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రకటించింది. ఆరో రోజూ దాడులు తీవ్రంగానే జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు గాజాలో దాదాపు 150 పౌరులని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విడిచిపెట్టేంత వరకూ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరో ప్రకటన కూడా చేసింది. నార్త్‌ గాజాలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. నార్త్ గాజాలోని 10 లక్షల మంది పౌరులు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పింది. 24 గంటల్లోగా అంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గాజా మొత్తం జనాభాలో సగం ఈ నార్త్ గాజాలోనే ఉంటున్నారు. ఈ ప్రకటన ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే వాళ్లు ఎక్కడికి పోతారని ప్రశ్నిస్తున్నాయి మానవ హక్కుల సంఘం. ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ ఆదేశాలు పాటించడం అసాధ్యం అని తేల్చి చెప్పింది. తీవ్ర పరిణామాలను తప్పించాలంటే ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది. అటు ఇజ్రాయేల్ మాత్రం తన వాదన వినిపిస్తోంది.


గాజా సెక్యూరిటీ ఫెన్స్ వద్ద సాహసోపేతమైన ఆపరేషన్‌ నిర్వహించి 250 మంది బందీలను కాపాడాయి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు. చాకచాక్యంగా దాడి చేసి 60 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. హమాస్‌ సౌత్‌ డివిజన్‌ కమాండర్‌నీ అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ఓ వీడియోని IDF ట్విటర్‌లో విడుదల చేసింది. డిఫెన్స్ బలగాలు ఎంత ధైర్యం చేసి హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టాయో ఈ వీడియోని సాక్ష్యంగా చూపించింది. 


Also Read: ఇజ్రాయేల్ చేసిన ఖర్చంతా బూడిద పాలేనా? యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది?