Asteroid Bennu: భూమిపైకి తీసుకువచ్చిన 4.5 బిలియన్ సంవత్సరాల పురాతన గ్రహశకలం బెన్నూలో కనుగొన్న విషయాలను US అంతరిక్ష సంస్థ నాసా గురువారం వెల్లడించింది. గ్రహశకలం నమూనాలో ఊహించిన దానికంటే ఎక్కువ కార్బన్ ఉండటమే కాకుండా, నీరు కూడా సమృద్ధిగా ఉందని నాసా తెలిపింది. ప్రాథమిక పరిశోధనల ద్వారా, భూమిపై జీవం ఏర్పడానికి మూలాలు కూడా కనుగొనే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. OSIRIS-REx భూమికి అందించిన అతిపెద్ద కార్బన్-రిచ్ గ్రహశకలమని, రాబోయే తరాలు భూమిపై జీవం మూలాలను పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు సహాయం చేస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు.
అంతరిక్ష యాత్రలో 60 గ్రాముల గ్రహశకలం నమూనాలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సేకరించిన నమూనాలు 250 గ్రాముల కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్నాయి. వాటిని సహజమైన స్థితిలో భద్రపరచినట్లు నాసా తెలిపింది. ఈ నమూనాలు సౌర వ్యవస్థ మూలాల గురించి పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు కీలకమైన సమాచారాన్ని అందజేస్తాయని నాసా భావిస్తోంది. అంతరిక్ష వ్యామ నౌక సాయంతో గత నెలలో బెన్ను గ్రహశకలం నమూనాల్లో పురాతన నల్లధూళి, గులకరాళ్లను నాసా సేకరించింది. ఈ నమూనాలు మన సౌర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాలు, భూమి ఏలా ఏర్పడింది? జీవం ఎలా పుట్టింది తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని నాసా పేర్కొంది. భవిష్యత్తులో ఈ శకలాలను మరింత విశ్లేషించి సమాచారాన్ని రాబడతామంది.
OSIRIS-REx అనే ఈ వ్యోమనౌక 2016లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇది డిసెంబర్ 2018లో బెన్నూను చేరుకుంది. OSIRIS-REx రెండు సంవత్సరాల పాటు గ్రహశకలాన్ని మ్యాప్ చేసిన తర్వాత... 2020లో బెన్నూ నుంచి రాళ్లు, ధూళిని సేకరించింది. మే 10, 2021న... OSIRIS-REx బెన్నూ పరిసరాల నుంచి బయలుదేరింది. OSIRIS-REx మిషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే అంతరిక్ష నౌక భూమిపైకి దిగలేదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్ విడుదల చేసింది. ఉటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది. నమూనాను విడుదల చేసిన 20 నిమిషాల తర్వాత అంతరిక్ష నౌక ఇంజిన్లను మండించుకుని అపోఫిస్ ఆస్టరాయిడ్ వద్దకు పయనమైంది. ఈ వ్యోమనౌక 2029లో ఆస్టరాయిడ్‌ను చేరుకుంటుంది. ఒక గ్రహశకలం నుంచి నమూనాను సేకరించి తిరిగి వచ్చిన మొదటి US మిషన్‌గా చరిత్ర సృష్టించింది.
బెన్నూని ముందుగా 1999 RQ36 అని పిలిచేవారు. OSIRIS-REx అంటే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్‌ప్రెటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ సెక్యూరిటీ- రెగోలిత్ ఎక్స్‌ప్లోరర్. OSIRIS-REx భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత... నమూనా రిటర్న్ క్యాప్సూల్‌ను విడుదల చేసింది. అవి ప్యారాచూట్ ద్వారా ఉటా ఎడారిలో ల్యాండింగ్ అయ్యాయి. వీటిని ముందుగా ఉటా ఎడారి పరిధిలోని తాత్కాలిక క్లీన్ ల్యాబ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత... క్లోజ్‌చేసిన కంటైనర్‌లో ఉంచి హ్యూస్టన్‌కు తరలిస్తారు. గ్రహశకలం నమూనా బరువు 250 గ్రాములు ఉంటుందని అంచనా. క్యాప్సూల్‌లోని 75శాతం భాగాన్ని భవిష్యత్ పరిశోధన కోసం... హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో భద్రపరుస్తారు. మిగిలిన నమూనాను పరిశోధిస్తారు. వాటి ఫలితాలు 2025లోపు వచ్చే అవకాశం ఉంది. OSIRIS-REx మిషన్ను కూడా OSIRIS-APEXగా పేరు మార్చించింది నాసా.