Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం భీకరంగా మారుతోంది. హమాస్ ఉగ్రవాదులు రాక్షసంగా, అత్యంత కిరాతకంగా మారణకాండ సృష్టిస్తున్నారు. అత్యంత పాశవికంగా నెలలు కూడా నిండని పసికందులను సైతం హతమార్చుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను గురువారం ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్ రాక్షసుల చేతిలో హతమైన, భయంకరంగా ఉన్న శిశువుల చిత్రాలను ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చూపించారు. అందులోని కొన్ని చిత్రాల్లో నల్లగా కాలిపోయిన శిశువుల శరీరాలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున హమాస్ ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగి శిశువులను హత్య చేశారని ఇజ్రాయెల్ ఆరోపించింది.


సోషల్ మీడియా ఎక్స్‌లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అధికారిక ఖాతాలో ఫొటోలను షేర్ చేశారు. వాటి గురించి ప్రస్తావిస్తూ.. ‘ఇవి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు చూపించిన కొన్ని ఫోటోలు. ఇవి హమాస్ రాక్షసులు చంపిన, కాల్చిన శిశువుల భయానక ఫోటోలు. హమాస్ అమానుషం’ అంటూ పేర్కొన్నారు. దాదాపు 40 మంది శిశువుల మృతదేహాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. దీనిపై i24 న్యూస్ జర్నలిస్ట్ నికోల్ జెడెక్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ భూభాగంలో జరిగిన హింసాత్మక చర్యల్లో ఇదే మొదటిదని అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. 


గురువారం, US అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. దారుణ హత్యలు ప్రచారమని,  నిజంగా పిల్లల తలలు నరికివేసే ఉగ్రవాదుల చిత్రాలను చూస్తానని అనుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఫొటోలపై వైట్ హౌస్ స్పందించింది. బైడెన్, ఇతర US అధికారులు అలాంటి చిత్రాలను చూడలేదని, ఎటువంటి నివేదికలను ధృవీకరించలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మీడియా నివేదికలు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికార ప్రతినిధి చేసిన వాదనల ఆధారంగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ఉన్నాయని వైట్ హౌస్ తెలిపింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత, ఇజ్రాయెల్ ప్రభుత్వం హత్యకు గురైన శిశువుల ఫొటోలను షేర్ చేసింది. హమాస్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారని ఆరోపించింది. ఈ ఫొటోలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కూడా పంచుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.


పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐడీఎఫ్ దాడులతో గాజా దద్దరిల్లిపోతోంది. రెండు దేశాల మధ్య ఇతర దేశాలకు విస్తరిస్తోంది. లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకువచ్చాయి. పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు, ఊహించని దాడి ఎదురైంది.  లెబనాన్‌, సిరియాల వైపు నుంచి దాడులు జరిగాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు, ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. 


అసలే గాజాలో ఇజ్రాయెల్‌ దాడులతో పరిస్థితి దిగజారుతుందని  ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి, రెండు దేశాలు సంయమనం పాటించాలని ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేస్తున్న దాడుల వెనుక ఇరాన్‌ పాత్రపై నిర్దిష్ట సమాచారమేమీ లేదని అమెరికా తెలిపింది. మిలిటెంట్ల గ్రూపులోని పోరాట విభాగానికి నిధులు అందిస్తున్నట్లు మాత్రం స్థూలంగా కనిపిస్తోందని వెల్లడించింది.