ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ కమాండర్ మహమూద్ అల్-జహర్ మరింత ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంపై ఆధిపత్యమే తమ లక్ష్యం అంటూ ఆయన హమాస్ మిలిటెంట్ సంస్థ సభ్యులతో మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఒక నిమిషం పాటు ఈ వీడియో ఉంది. ఇజ్రాయెల్ కేవలం తమ ప్రారంభ లక్ష్యం అని, ప్రపంచం మొత్తం తమ చట్టంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.
'ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం మాత్రమే, మొత్తం భూ గ్రహమే మా చట్టం పరిధిలోకి వస్తుంది. పూర్తి గ్రహంలోని 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు అన్యాయం, అణిచివేత, హత్యలు, నేరాలు లేని సిస్టమ్ కిందకు వస్తాయి. పాలస్తీనియన్లకు, అరబ్స్, అన్ని అరబ్ దేశాలకు, లెబనాన్, సిరియా, ఇరాక్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా నేరాలు జరగని చట్ట పరిధుల్లోకి అందరూ వస్తారు' అంటూ వ్యాఖ్యలు చేశాడు. హమాస్ నుంచి ఈ వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కచ్చితంగా కొనసాగుతుందని, అందుకు నిబద్ధులమై ఉన్నామని పునరుద్ఘాటిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రతి హమాస్ సభ్యుడు 'చనిపోయిన వ్యక్తి' అవుతారంటూ హెచ్చరించారు. హమాస్ దాయూష్ లాంటి సంస్థ అని, ప్రపంచం దాయూష్‌ను నాశనం చేసినట్లు తాము హమాస్‌ను అంతం చేస్తామని టెలివిజన్ ప్రకటనలో స్పష్టంచేశారు.
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైనికులను, పౌరులను చాలా మందిని బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌కు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే బందీలను ఇంటికి ఒకరిని ఉరి తీస్తామని హమాస్ బెదిరిస్తోంది. కాగా ఇజ్రాయెల్ హమాస్ ఆధీనంలోని గాజా స్ట్రిప్‌ను పూర్తిగా అష్ట దిగ్భంధం చేసింది. అక్కడికి నీరు, విద్యుత్, ఆహారం అందకుండా చేస్తోంది. గాజా మొత్తం ఇప్పుడు పూర్తిగా అధకారం అయ్యింది. దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల శవాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ చెప్తోంది. హమాస్‌ను ఎదుర్కొంనేందుకు ఇజ్రాయెల్‌లో అత్యవసర ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా నెతన్యాహుతో కలిసి వచ్చాయి. సమైక్యంగా యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా, యూకే, భారత్ సహా పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి.
గత శనివారం పాలస్తీనాకు చెందిన హమాస్ మిలెటంట్ సంస్థ కేవలం 30 నిమిషాల వ్యవధిలో ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లు ప్రయోగించి మెరుపు దాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేస్తోంది. ఇలా ఇరు వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భీకర ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కాగా ఈ ఘర్షణల కారణంగా ఇరువైపులా ఇప్పటికి 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం జరుగుతున్న ఇరు వైపు ప్రాంతాల్లోనూ పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఇజ్రాయెల్‌పై లెబనాన్, సిరియాల నుంచి కూడా రాకెట్ దాడులు జరిగాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు, ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. లెబనాన్, సిరియాలతోపాటు ఇరాన్, ఖతార్, కువైట్ హమాస్‌ను సమర్థిస్తున్నాయి.