Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇందులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది భవన శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. మరికొంత మంది ఊచకోతకు గురయ్యారు. వేల మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌పై హమాస్ భీకరంగా దాడి చేసింది. ఒక రోజులో ఐదు వేలకు పైగా రాకెట్లు, క్షిపణులను ప్రయోగించింది. డ్రోన్‌లతో పేలుడు పదార్థాలను పడవేసి పేలుళ్లకు పాల్పడింది. అంతేకాదు హమాస్ ఉగ్రవాదుల వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందు గుండు సామగ్రి ఉన్నాయి.
హమాస్‌కు ఆయుధాలు ఎలా వచ్చాయి?
ఈ దాడులన్నీ హమాస్ పాలనలో ఉన్న గాజా నుంచే జరిగాయి. ఇది చాల పేద, తక్కువ వనరులు, జనసాంద్రత ఉన్న ప్రదేశం. విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనిని రెండు వైపులా ఇజ్రాయెల్, ఒక వైపు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నాయి. హమాస్ నియంత్రణలోకి వెళ్లాక దాదాపు 17 సంవత్సరాలుగా ఇది బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసేంత ఆయుధాలను ఎలా సేకరించింది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి పలువురు నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
స్మగ్లింగ్, సొంతంగా తయారీ!
హమాస్ స్మగ్లింగ్ చేయడం, స్థానికంగా తయారు చేసుకోవడం ద్వారా ఆయుధాలను పొందుతుందని, ఇరాన్ నుంచి కొంత సైనిక మద్దతును అందుకుంటోందని CIA వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా కాలంగా హమాస్‌కు ప్రధాన సైనిక మద్దతుదారుగా ఉందని, రహస్య సరిహద్దు సొరంగాలు, పడవల ద్వారా గాజాలోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్‌తో పోలిస్తే హమాస్ టన్నెల్ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ భారీగానే ఉన్నాయని వాషింగ్టన్‌లోని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ (MEI)లో సీనియర్ ఫెలో, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ బిలాల్ సాబ్ అన్నారు.
ఆయుధాల తయారీకి శిక్షణ
ఇరాన్ నుంచి హమాస్ సొరంగ మార్గాల ద్వారా భారీగా ఆయుధాలు పొందిందని, ఇది చాలా కాలంగా జరిగిందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) సీనియర్ ఫెలో డేనియల్ బైమాన్ అన్నారు. హమాస్‌కు ఇరాన్ అధునాతనమైన, బాలిస్టిక్ క్షిపణులను సముద్రం ద్వారా గాజాకు రవాణా చేస్తోందని MEIలో సీనియర్ ఫెలో చార్లెస్ లిస్టర్ చెప్పారు. పెద్ద ఆయుధాల కోసం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ మిలిటరీ శాఖ, దాదాపు రెండు దశాబ్దాలుగా హమాస్ ఇంజినీర్లకు ఆయుధ శిక్షణ ఇస్తోందని లిస్టర్ తెలిపారు.
ఆశ్చర్యం వ్యక్తం చేసిన నిపుణులు
హమాస్ సొంతంగా ఆయుధాలు తయారుచేసుకోవడానికి ఇరాన్ సహకరించిందని, సొంతంగా ఆయుధాగారాలను సృష్టించుకోవడానికి వీలు కల్పించిందని CSISలో బైమాన్ చెప్పారు. తక్కువ వ్యవధిలో పెద్ద ఎత్తున ఆయుధాలు వాడడం అంటే హమాస్ తన ఆయుధాగారాన్ని స్మగ్లింగ్, సుదీర్ఘకాలంగా నిర్మించుకుంటూ ఉండాలని మిడిల్ ఈస్ట్ వ్యవహారాలు, యుఎస్ వైమానిక దళ విశ్లేషకుడు ఆరోన్ పిల్కింగ్టన్ అన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్షియన్, సౌదీ ఇంటెలిజెన్స్ మొదలైనవాటిని తప్పించుకుంటూ వేలాది రాకెట్లను నిల్వ చేయడం, తరలించడం, ఏర్పాటు చేయడం, కాల్పులు జరపడం ఆశ్చర్యకరమైన విషయమని నిపుణులు అన్నారు. ఇరాన్ సహకారం లేకుండా పాలస్తీనా తీవ్రవాదులు దాడులు చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.
తెర ముందు హమాస్, తెర వెనుక ఇరాన్
లెబనాన్‌లో ఉన్న సీనియర్ హమాస్ అధికారి ఆదివారం ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హమాస్ ఆయుధాల తయారీ వివరాలను తెలిపారు. తమకు 250 కి.మీ, 160 కి.మీ, 80 కి.మీ, 10 కి.మీల రాకెట్ల తయారు చేసుకునేలా అన్ని చోట్ల స్థానిక కర్మాగారాలు ఉన్నాయని చెప్పారు. మోర్టార్లు, వాటి షెల్స్ కోసం ఫ్యాక్టరీలు ఉన్నాయని, రైఫిల్స్, వాటిలో వాడే బుల్లెట్ల కోసం ఫ్యాక్టరీలు ఉన్నట్లు విదేశాల్లోని హమాస్ నేషనల్ రిలేషన్స్ హెడ్ అలీ బరాకా చెప్పినట్లు తెలిసింది.
వారాంతంలో నిర్వహించిన దాడికి మిలిటెంట్ గ్రూప్ రెండేళ్లుగా ప్రణాళికలు వేసిందని అలీ బరకా చెప్పారు. దాడి ప్రణాళికలో బయటి ప్రమేయం గురించి ప్రస్తావించకపోయినా, మిత్రపక్షాలు ఆయుధాలు, డబ్బుతో మాకు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఇందులో ఇరాన్ ముందు వరుసలో ఉంటుందని తమకు డబ్బు, ఆయుధాలను ఇస్తుందని బరాకా వెల్లడించారు.