ఇజ్రాయిల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో భారతదేశం, ఇజ్రాయిల్ లో చిక్కుకున్న తమవారి సౌలభ్యం కోసం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి భద్రత, శ్రేయస్సు కోసం తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని జైశంకర్ అన్నారు. ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించే ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడిన విషయాని కూడా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభంపై చర్చించినట్టుగా చెప్పారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌తో చర్చలు జరిపిన తొలి అరబ్ దేశం యూఏఈ.
ఇజ్రాయిల్, హమాస్ ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. వందలాది మంది మరణిస్తున్నారు. వేలాదిమంది గాయపడుతున్నారు. పరిస్థితి రోజు రోజుకి దారుణంగా ఉండడంతో భారతదేశం ఇజ్రాయిల్ నుండి భారతీయులను తిరిగి తీసుకువచ్చే పని ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం పాలస్థీనా గ్రూప్ హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దేశంలో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ చెప్పారు. వారిలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్న వారు.. అదే సమయంలో ఇజ్రాయిల్ లో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. భారతదేశం తన పౌరులందరినీ ఇజ్రాయిల్ నుండి సురక్షితంగా తిరిగి తీసుకువస్తుందని, ఇందుకోసం చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు.
భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. గురువారం నుండి ఆపరేషన్ అజయ్ ప్రారంభమవుతుందని వార్తా సంస్థ ANI కి తెలియజేసింది. ఇప్పటికే ప్రత్యేక విమానంలో నమోదు చేసుకున్న భారతీయ పౌరులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించామని తెలిపింది. వారిని దశల వారీగా ఇండియాకు తీసుకువస్తారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లోని ఉన్నతాధికారులు, అక్కడి భద్రతా బలగాల సాయంతో ఎయిరిండియా , దౌత్యకార్యాలయాల సమన్వయంతో ఆపరేషన్ అజయ్‌ను నిర్వహిస్తున్నారు.
యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని రాయబార కార్యాలయం ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారతదేశం ఇంతకు ముందు కూడా యుద్ధ ప్రాంతాలు, కరోనా మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాల నుండి తన పౌరులను క్షేమంగా దేశానికి తీసుకువచ్చింది.
గతంలో ఆపరేషన్ గంగా..
2002 లో రష్యా సైనిక దాడితో కకావికలమైన ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ గంగా. ఆ సమయంలో ఎప్పటికప్పుడు దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను ముమ్మరంగా నిర్వహించింది. ఉక్రెయిన్ నుంచి అక్కడి సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలించింది.