Qualcomm Layoffs: 


క్వాల్‌కమ్‌లో లేఆఫ్‌లు..


క్వాల్‌కమ్ మరోసారి లేఆఫ్‌లు (Qualcomm Layoffs) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో మరో విడత ఉద్యోగాల కోత తప్పదని వెల్లడించింది. సాన్‌ డీగో (San Diego)లోని క్యాంపస్‌లో 1,064 మంది, శాంటక్లారా క్యాంపస్‌లో 194 మంది ఉద్యోగులను ఇంటికి పంపనుంది క్వాల్‌కమ్. మొత్తం కంపెనీలోని ఉద్యోగుల్లో ఈ లేఆఫ్‌ల వాటా 2.5%. డిసెంబర్ 13 నుంచి ఈ లేఆఫ్‌ల ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎందుకీ లేఆఫ్‌లు అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది క్వాల్‌కమ్. గత త్రైమాసిక ఫలితాలను ఉదాహరణగా చూపిస్తోంది. రెవెన్యూ బాగా తగ్గిపోయిందని, అందుకే వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకోక తప్పడం లేదని ప్రకటించింది. మార్కెట్‌లో డిమాండ్ కూడా గతంలోలా లేదని, అందుకే కంపెనీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఉన్న పెట్టుబడులు పోకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పవని స్పష్టం చేసింది. 


"ప్రస్తుతానికి కంపెనీ డెవలప్‌మెంట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాం. గతంలో ఉన్నట్టు ప్రస్తుతం డిమాండ్ లేదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోక తప్పడం లేదు. ఈ మార్పుల్లో అతి ముఖ్యమైంది వర్క్‌ఫోర్స్ తగ్గించుకోవడం. ఇప్పుడదే చేస్తున్నాం. గత త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. కనీసం ఈ తరవాతైనా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. 2024 మొదటి ఆర్నెల్లు పూర్తయ్యే నాటికి పుంజుకుంటామని భావిస్తున్నాం"


- క్వాల్‌కమ్ యాజమాన్యం


మార్కెట్‌పై ప్రభావం..! 


అయితే...ఈ ప్రకటన తరవాత కూడా క్వాల్‌కమ్ షేర్‌ల ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ..సెమీ కండక్టర్‌ల తయారీలో అగ్ర సంస్థగా ఉన్న క్వాల్‌కమ్‌లో లేఆఫ్‌ల కారణంగా ఆ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయి. కొవిడ్ తరవాత ఇంకా కంపెనీలు కోలుకోలేదన్న సంకేతాలిస్తున్నాయి. క్వాల్‌కమ్ ఒక్కటే కాదు. బడా కంపెనీలన్నీ ఇప్పటికే ఈ బాట పట్టాయి. మిగతా సంస్థలతో పోటీ పడి ముందుకు వెళ్లాలంటే ఈ ట్రెండ్‌ని కొనసాగించక తప్పని పరిస్థితులు వచ్చాయి. కొత్తగా ప్రకటించిన లేఆఫ్‌లు డిసెంబర్‌లో మొదలవుతాయి. ఈ ఉద్యోగులకు ఏదైనా పరిహారం ఇచ్చి పంపుతుందా..? లేదంటే ఖాళీ చేతుల్తోనే సాగనంపుతుందా అన్నది ఇంకా తెలియలేదు. గతేడాది నుంచి చాలా కంపెనీలు ఇలానే ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగించాయి. కాకపోతే వాళ్లకి ఆ మేరకు ఎంతో కొంత పరిహారం అందజేశాయి. 


తప్పని నష్టాలు.. 


కొద్ది నెలలుగా క్వాల్‌కమ్ కంపెనీ సేల్స్, రెవెన్యూ దారుణంగా పడిపోయాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని చెబుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ డివిజన్‌లో ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటోంది ఈ సంస్థ. క్వాల్‌కమ్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు బాగా పడిపోయాయి. అందుకే...ఉన్న రీసోర్సెస్‌లను కాస్త తగ్గించుకుని మిగతా వాటితో కంపెనీని రన్ చేయాలని భావిస్తోంది. 2022 డిసెంబర్ నాటికే క్వాల్‌కమ్ యాన్యువల్ ప్రాఫిట్ 34% మేర తగ్గిపోయింది. రెవెన్యూలోనూ 12% మేర కోత పడింది. ఈ నష్టం మరీ ఎక్కువ అవ్వకముందే అప్రమత్తమవుతోంది కంపెనీ. అందుకే ఉద్యోగులను తొలగించి ఆ మేరకు రెవెన్యూని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 


Also Read: హమాస్ బంకర్‌లపై ఇజ్రాయేల్ సైనికుల మెరుపు దాడులు, ఒళ్లు గగుర్పొడిచే వీడియో