Hamas Palestine Attack: 


భారత్‌లోనూ ఉగ్రదాడులు..? 


ఇజ్రాయేల్ పాలస్తీనా వార్ ఎఫెక్ట్ ఇండియాలోనూ గట్టిగానే కనిపిస్తోంది. ఇక్కడా ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఢిల్లీతో పాటు మరి కొన్ని చోట్ల కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నమాజ్‌లను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయేల్ ఎంబసీతో పాటు జూదులకు సంబంధించిన మతపరమైన నిర్మాణాలు, ప్రార్థనా మందిరాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఢిల్లీ సహా మరి కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనూ అలెర్ట్ చేశాయి నిఘా సంస్థలు. దేశంలోని ఇజ్రాయేల్ పౌరులకు రక్షణ కల్పించాలని సూచించాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలను అలెర్ట్ చేశాయి. ఆయా రాష్ట్రాల్లోని ఇజ్రాయేల్ దౌత్యవేత్తలు, స్టాఫ్‌, టూరిస్ట్‌ల ప్రాణాలకు హాని లేకుండా చూసుకోవాలని నిఘా సంస్థలు సూచించాయి. జూదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని ఇప్పటికే యూకే, ఫ్రాన్స్‌, యూఎస్‌, జర్మనీలో భద్రత పెంచారు. పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశముందని అప్రమత్తమయ్యాయి.