Israel Palestine Attack:
వేలాది మంది పరుగులు..
ఇజ్రాయేల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య (Israel Hamas War) యుద్ధం స్థానిక పౌరుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గాజా ప్రాంతం రాకెట్‌ల దాడులతో మారు మోగుతోంది. వేలాది మంది ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎక్కడైనా తలదాచుకున్నా..ఆ స్థావరాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయేల్ సైన్యం అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. కొంతమంది పౌరులు క్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయినా చాలా మంది ఈ దాడులకు బలి అవుతున్నారు. గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్ట్‌లకూ తీవ్ర గాయాలవుతున్నాయి. Reuters జర్నలిస్ట్ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు జర్నలిస్ట్‌లూ మృతి చెందారు.
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకొందరు అదృశ్యమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని CNN న్యూస్ రిపోర్ట్ చేసింది. లెబనాన్‌లోని ఆయుధ కర్మాగారంపై ఇజ్రాయేల్ మిలిటరీ దాడి చేయడం వల్ల పేలుడు సంభవించింది. ఇక్కడే హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయేల్ సైన్యానికి కాల్పులు జరిగాయి. గాజా స్ట్రిప్ వద్ద పెద్ద ఎత్తున ట్రూప్‌లు హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మిలిటరీ ప్రకటించింది. సొరంగాల్లో భారీ ఎత్తున ఆయుధాలు దాచుకున్నారు హమాస్ ఉగ్రవాదులు. ఆ స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి వెళ్లిపోతున్న మహిళలు, చిన్నారులు ఈ దాడులకి బలి అయ్యారు. కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. కార్‌లలో చాలా మంది గాజా వదిలి వెళ్లిపోతున్నారు. ఫలితంగా చాలా చోట్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. వేలాది మంది వరస కట్టారు.