ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వంధ్యత్యం సమస్య పెరుగుతోందని నిపుణులు, ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వంధ్యత్య సమస్య పరిష్కారానికి కీలక సూచనలు చేశారు. పురుషులు, వారి భాగస్వాములు, సంతానానికి సంబంధించిన కణజాలాలు, క్లినికల్ డేటాతో ప్రపంచస్థాయి ‘బయోబ్యాంక్’ ఏర్పాటు చేయాలని, సంతానలేమికి జన్యు, పర్యావరణ కారణాల గురించి తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. తాము తండ్రి కాలేకపోవడానికి కారణాలను తెలుసుకొని, తదనుగుణంగా చికిత్సలు పొందే హక్కు బాధితులకు ఉంటుందని, అయితే నిధులు, సరైన పరిశోధనలు, ప్రామాణిక చికిత్సల కొరత వంటి కారణాలతో ఉపశమనం దక్కడంలేదన్నారు. ఎప్పటికప్పుడు జన్యు క్రమాలను ఆవిష్కరించడం, మెరుగైన వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలను తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. పురుషులు, మగపిల్లలను హానికర రసాయనాల నుంచి రక్షించడానికి విధాన నిర్ణయాలు అవసరమని, ఈ పదార్థాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను గుర్తించాలని, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా పురుషులను ప్రోత్సహించాలని సూచించారు.
వంధ్యత్వం అంటే ఏమిటి?
పునరుత్పత్తి ప్రక్రియలో అత్యంత కీలకమైన దశలలో ఒకటి ఫలదీకరణం. దీనర్థం, విడుదలైన అనేక స్పెర్మ్‌లలో, కనీసం ఒకటి ప్రయాణించి ఆడ గుడ్డును చేరుకుని దానిని ఫలదీకరణం చేయాలి. హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి అవయవాలలో అడ్డంకులు, తక్కువ స్పెర్మ్ కౌంట్ తో స్త్రీని గర్భం దాల్చలేకపోతే, అది మగ వంధ్యత్వానికి కారణం. పురుషులలో రెండు రకాల వంధ్యత్వాలు ఉంటాయి. ప్రాథమిక వంధ్యత్వం అంటే వారి జీవితకాలంలో ఒక్కసారి కూడా గర్భం ధరించలేక, బిడ్డను కనలేరు. ద్వితీయ వంధ్యత్వం అంటే గతంలో విజయవంతంగా బిడ్డను కన్న తర్వాత మళ్లీ గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయి. సకాలంలో సంప్రదింపులు, నిపుణులైన వైద్య పరీక్షలు మరియు విశ్లేషణ గర్భధారణలో ఆలస్యం యొక్క మూల కారణాన్ని గుర్తించడానికి మరియు సరైన చికిత్సను అందించడానికి సహాయపడతాయి. వంధ్యత్వం అనేది మగ లేదా ఆడవారి పునరుత్పత్తి అవయవాలలో ఒక సమస్య, ఇది పిల్లలను గర్భం దాల్చకుండా చేస్తుంది.
ఆడవాళ్లకు మాత్రమే వస్తుందనుకోవడం పెద్ద తప్పు
వంధ్యత్వం సమస్య సాధారణంగా ఆడవాళ్లకు మాత్రమే వస్తుందనుకోవడం పెద్ద తప్పు. వంధ్యత్వం స్త్రీ, పురుషులిద్దరి సమస్య కావొచ్చు. ఇది కేవలం మహిళల సమస్య మాత్రమే కాదు. వంధ్యత్వం లేదా వంధ్యత్వ కేసులలో మూడింట ఒక వంతు మగ సంతానోత్పత్తి సమస్యల వల్ల, మూడింట ఒక వంతు కేసులు స్త్రీ సంతానోత్పత్తి సమస్యల వల్ల సంభవిస్తాయి. మూడింట ఒక వంతు కేసులు రెండు వైపులా లేదా తెలియని కారకాల వల్ల సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గుతుంది. 35 ఏండ్లు పైబడిన మహిళలు, 50 ఏండ్లు పైబడిన పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది. కానీ యువతీ యువకులు కూడా దీనితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 10 మంది మహిళల్లో ఒకరు 30 ఏండ్లకు చేరుకోకముందే వంధ్యత్వం సమస్య వచ్చే అవకాశం ఉంది. వంధ్యత్వ సమస్యలు పురుషులు, మహిళలు ఇద్దరిలో సాధారణం. మగ లేదా స్త్రీ భాగస్వామిలో వంధ్యత్వ సమస్య యొక్క రకాన్ని గుర్తించడానికి పూర్తి క్లినికల్ పరీక్షలు చేయించాలి.