Israel Gaza Attack:



ఐరాస భద్రతా మండలిలో చర్చ..


ఇజ్రాయేల్,గాజా యుద్ధంపై (Israel Hamas War) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ (UN Security Council) చర్చ జరిగింది. గాజాని ఇజ్రాయేల్‌ ఆక్రమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. దీనిపై మండలి అసహనం వ్యక్తం చేసింది. గాజా పౌరుల భద్రతను పణంగా పెట్టారని మండి పడింది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది పౌరులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. అయితే...ఇజ్రాయేల్‌కి అమెరికా పూర్తి మద్దతునిస్తోంది. ఇజ్రాయేల్‌ తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చుని తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో ప్రస్తుత జనాభా 23 లక్షల వరకూ ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి వీళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయేల్‌ దాడుల్లో ఇళ్లు,భవనాలు నేలమట్టం అవుతున్నాయి. కొందరు శిథిలాలే కిందే చిక్కుకుపోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఇది చాలా అలజడి రేపింది. తినేందుకు తిండి లేదు. గొంతు తడుపుకునేందుకు నీళ్లూ కరవయ్యాయి. ఈ దాడుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందించడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఈ యుద్ధంలో 5,791 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 16 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్‌ గాజాని ఆక్రమించేందుకు ప్లాన్ చేస్తుండడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. పైగా అమెరికా మద్దతునిస్తుండడం వల్ల తీవ్రత పెరిగిపోయింది. 


భారత్ మాటేంటి..? 


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ తరపున ప్రతినిధి ఆర్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలోని పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత్‌ చింతిస్తోందని చెప్పారు. ఈ ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. గాజా పౌరుల గురించి ఆలోచించి స్పందించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే అని గుర్తు చేశారు. ఉగ్రదాడులు ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కి ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడికి ఓ ప్రశ్న ఎదురైంది. గాజా ఆక్రమణను నిలిపివేసేందుకు ఇజ్రాయేల్‌తో చర్చలు జరుపుతున్నారా అని బైడెన్‌ని ప్రశ్నించారు ఆస్ట్రేలియా ప్రధాని యాంటోని అల్బనీస్. దీనికి సమాధానమిస్తూ "ఇజ్రాయేల్‌ సొంత నిర్ణయం తీసుకోవచ్చు" అని వెల్లడించారు. అయితే...ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటెర్రస్ (Antonio Guterres) ఇజ్రాయేల్‌పై మండి పడ్డారు. అంతర్జాతీయ నిబంధనలు కాదని, గాజాపై దాడులు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయేల్ ఫైర్ అయింది. వెంటనే గటెర్రస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయేల్ ఆక్రమించడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. 


ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయేల్‌కి కీలక సూచనలు చేశారు. అనవసరంగా ఆవేశపడొద్దని హెచ్చరించారు. ఈ సమయంలోనే 9/11 దాడులను ప్రస్తావించారు. ఆ సమయంలో అమెరికా కూడా చాలా ఆగ్రహానికి లోనైందని, ఆ క్రమంలో కొన్ని తప్పులు చేసిందని అన్నారు. ఇజ్రాయేల్‌, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇప్పటికే టెల్‌ అవీవ్‌లో పర్యటించారు బైడెన్. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయుధ సహకారమూ అందిస్తున్నారు. అయితే...ఆవేశంతో సాధించేదేమీ లేదని హితవు పలకడమే ఆసక్తికరంగా మారింది. 


Also Read: క్రమంగా బలపడుతున్న హమూన్ తుఫాన్‌, 7 రాష్ట్రాలపై ఎఫెక్ట్ - 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు