ఇజ్రాయెల్‌ దాడులతో గాజా రక్తసిక్తమవుతోంది. గాజాలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 16 రోజులుగా ఐడీఎఫ్ గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాజాలో దాడులు ఆపేయాలని, యుద్ధానికి విరామం ఇవ్వాలని యురోపియన్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌-హమాస్‌లు యుద్ధానికి విరామం ఇవ్వాలని ఈయూ సూచించింది. కొద్ది రోజులు విరామం ఇస్తే గాజా ప్రజలకు మానవతా సాయం అందుతుందని, శరణార్థులకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. 


అది హమాస్ కే ప్రయోజనం
యూరోపియన్ యూనియన్ పిలుపును అమెరికా వ్యతిరేకించింది. యుద్ధానికి విరామం ఇవ్వడం వల్ల హమాస్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించింది. యుద్ధాన్ని ఆపడం వల్ల హమాస్‌కి విరామం లభిస్తుందని, బలం పుంజుకొని తిరిగి ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. దారుణమైన ఉగ్రదాడుల్ని ఎదుర్కొంటోన్న ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితిలో ఉందన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా అమెరికా ఆరోపణలు చేసింది. తన మద్దతున్న సంస్థల ద్వారా ఈ యుద్ధాన్ని ఎగదోస్తే కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించింది. ఒకవేళ ఇజ్రాయెల్‌- హమాస్ యుద్ధం తీవ్రతరం అయితే అది మీ వరకూ వస్తుందని ఇరాన్ ను హెచ్చరించింది. హమాస్‌ దాడులు ఇరాన్ ప్రమేయం లేకుండా జరిగాయని భావిస్తే, అది హాస్యాస్పదమే అవుతుందని వ్యాఖ్యానించింది. అమెరికా పౌరులపై, సైనిక దళాలపై దాడులు జరిగితే దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌  ఇప్పటికే స్పష్టం చేశారు.


ఇరాన్ పాత్ర లేదు
గాజాలోని హమాస్‌తోపాటు లెబనాన్‌లోని హిజ్బుల్లాకు ఇరాన్‌ నిధులు సమకూర్చుతోంది. ఆ సంస్థలకు నిధులు, ఆయుధాలను సరఫరా చేస్తోందనే విమర్శలున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం అమల్లోకి వస్తే ముస్లిం దేశాల్లో పలుకుబడి ఉన్న తమకు ఎదురుదెబ్బ తగులుతుందని ఇరాన్ భావించింది. అందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై వ్యూహాత్మకంగా హమాస్‌తో ఇరాన్‌ దాడులు చేయించిందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే హమాస్‌ మిలిటెంట్లు చేసిన దాడిలో ఇరాన్‌ పాత్ర లేదని హమాస్ క్లారిటీ ఇచ్చింది. 


రసాయన ఆయుధాలనూ వాడేందుకు ప్లాన్


మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై దాడులకు రసాయన ఆయుధాలనూ వాడేందుకు సన్నద్ధమయ్యారని ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు హెర్జోగ్‌.  తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఐజాక్ హెర్జోగ్‌ వెల్లడించారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికిందన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్‌ ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్‌ సభ్యుల దగ్గర దొరికాయన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.