ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న బాంబుదాడుల్లో పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విద్యుత్ సరఫరా కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వివిధ ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల ఆరోగ్యంపై ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనేక మంది శిశువులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని  ఆవేదన చెందుతున్నారు.


అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భారీ విపత్తు ఎదురవుతుందని గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గాజాస్ట్రిప్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నారు. ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.  


గాజాలో 13 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అతి పెద్దదైన అల్‌- షిఫా ఆస్పత్రిలో సైతం ఇంధనం నిండుకుందని వైద్యులు తెలిపారు. ఇంక్యుబేటర్లు సహా అత్యంత అవసరమైన వాటికి మాత్రమే ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే అది ఎంత సమయం పాటు వస్తుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజా ఆస్పత్రులకు ఇంధన సాయం కోసం యావత్ ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు పెట్రోల్‌ బంకులను సైతం ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఇంధనాన్ని సాధ్యమైనంత వరకు విరాళంగా ఇవ్వాలని కోరారు. అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 5వేల మందికిపైగా పాలస్తీనా పౌరులు మృతి చెందారు. వీరిలో 2,055 మంది చిన్నారులు, 1,119 మంది మహిళలే ఉన్నారు. మరోవైపు 15వేల మందికి పైగా పౌరులు గాయపడ్డారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 


గాజాలో బాధితుల కోసం 6.5 టన్నుల వైద్య, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని భారత్‌ పంపింది. భారతీయ వాయుసేనకు చెందిన సీ-17 విమానం వాటిని తీసుకుని ఈజిప్టులోని ఎల్‌-అరిష్‌ విమానాశ్రయానికి వెళ్లింది. ఇందులో ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగులు, టార్పాలిన్స్‌, శానిటరీ వస్తువులు, నీటిని శుద్ధి చేసే ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి మరో 143 మందితో ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. అందులో ఇద్దరు నేపాలీలు, నలుగురు శిశువులు ఉన్నారు.