Cyclone Hamoon: 



బలపడిన హమూన్..


హమూన్ తుఫాన్ ప్రభావం ( Cyclone Hamoon) మొదలైంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో క్రమంగా తుఫాను బలపడుతోంది. దక్షిణ చిట్టగాంగ్‌లో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు IMD అధికారికంగా ప్రకటించింది. ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా తుఫాను విస్తరించే అవకాశముందని అంచనా వేసింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలపడనుంది. అటు అరేబియా సముద్రంలో తేజ్ తుఫాన్‌ (Cyclone Tej) కూడా క్రమంగా బలపడుతోంది. యెమెన్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో ఇలా ఒకేసారి రెండు తుఫాన్లు బలపడడం కలవర పెడుతోంది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తీరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వానలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...అక్టోబర్ 24 అర్ధరాత్రి నాటికి తేజ్ తుఫాన్‌ బలపడింది. యెమెన్ తీర (Yemen Coast) ప్రాంతాల్లో  గంటకి 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హమూన్ తుఫాన్ కారణంగా దాదాపు 7 రాష్ట్రాల్లో ప్రభావితం కానున్నాయి. అందులో ఈశాన్య రాష్ట్రాలూ ఉన్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. IMD అంచనాల ప్రకారం..64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయాల్లో అక్టోబర్ 26 వరకూ వర్షాలు కురవనున్నాయి.