Sri Lanka Free Visa: కరోనా, ఆర్థిక సంక్షోభం తరువాత శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. లంక పర్యాటక రంగాన్ని  ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్‌, చైనా, రష్యా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేసేందుకు లంక కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ (Ali Sabry)  ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. తద్వారా  ఆయా దేశాల టూరిస్టులు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా వీసాలు పొందవచ్చు. శ్రీలంక‌ను ఎక్కువగా పర్యటించేవారిలో భారతీయులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 


భారత్ నుంచే ఎక్కువ
గత సెప్టెంబర్‌లో ఇండియా నుంచి 30,000 కంటే ఎక్కువ మంది శ్రీలంకలో పర్యటించారు. ఇది ఆదేశానికి వెళ్లే మొత్తం టూరిస్టుల శాతంలో 26 శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. చైనా నుంచి 8,000 కంటే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లారు. 2019 ఈస్టర్ సండే బాంబు పేలుళ్ల తర్వాత 11 మంది భారతీయులతో సహా 270 మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఈ ద్వీపానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది.


పర్యాటకమే ఆధారం
ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగం నుంచే వస్తోంది. కరోనాకు ముందు లంక పర్యాటక ఆదాయం రూ.360 కోట్లకు పైగా ఉండేది. కోవిడ్, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో దేశం మొత్తం సంక్షోభంలో పడిపోయింది. దీంతో ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల గణనీయంగా తగ్గిపోయింది. 


దిద్దుబాటు చర్యలు
ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్‌, పోలండ్‌, బెలారస్‌కు చెందినవారు ఉంటారు. అయితే అక్కడ యుద్ధం నేపథ్యంలో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఆదాయం పడిపోయింది. ఆపై పేరుకుపోతున్న అప్పులతో అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 


పెరుగుతున్న సంఖ్య
ఈ నేపథ్యంలోనే లంక ప్రోత్సాహానికి ఊతమిచ్చేలా సంస్కరణలను చేపట్టింది. 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది. కాగా శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి. 2023 సెప్టెంబర్​లో 10 లక్షల మంది పర్యాటకులు శ్రీలంకకు వెళ్లారు. 2019 తర్వాత ఇంత మొత్తంలో పర్యాటకులు రావడం ఇదే తొలిసారి.


అధ్వాన్నంగా ఆర్థిక పరిస్థితి
1948లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి శ్రీలంక ఇంతటి అధ్వాన్నమైన స్థితిలో లేదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతాలకుతలం చేసింది. ఈ పరిస్థితికి కారణమైన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తన ఆందోళన చేపట్టారు. దీంతో రాజకీయ అశాంతిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆహారం, ఔషధం, వంటగ్యాస్, ఇతర ఇంధనం, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టెలు వంటి అవసరమైన వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.