Israel Palestine Attack: 



30 మంది మృతి..


పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ దాడులు (Israel Hamas War) కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ ఇవి ఉద్ధృతమవుతున్నాయి. అయితే ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ బిల్డింగ్‌పై ఇజ్రాయేల్ దాడులు చేయగా..30 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. శరణార్థుల క్యాంప్‌ ఉన్న చోటే ఈ దాడి జరిగింది. ఈ ధాటికి బిల్డింగ్ కుప్ప కూలింది. పరిసర ప్రాంతాల్లోని భవనాలూ నేలమట్టమయ్యాయి. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ దాడుల కారణంగా 266 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా హెల్త్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 117 మంది చిన్నారులే ఉన్నారు. అక్టోబర్ 7 నుంచి దాడులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇజ్రాయేల్‌లో 4,600 మంది మృతి చెందారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ మిలిటరీ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌లో హిజ్బుల్లా (Hezbollah Cells) సెల్స్‌పై దాడి చేసినట్టు వెల్లడించింది. ఇజ్రాయేల్‌పై దాడి చేయాలని చూశారని, ఇది ముందే పసిగట్టి దాడి చేశామని తెలిపింది. ఈ దాడుల్లో హిజ్బుల్లాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సీరియస్ అయ్యారు. హిజ్బుల్లా ఇలా కవ్వింపు చర్యలకి పాల్పడితే రెండో లెబనాన్ యుద్ధం (Second Lebanon War) జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. హెజ్బొల్లా యుద్ధంలోకి వస్తే లెబనాన్‌ విధ్వంసాన్ని చవిచూడక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాము చేసే దాడులు ఊహించని విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. లెబనాన్‌ సరిహద్దుల్లోని కమాండోలతో నెతన్యాహు మాట్లాడారు. సరిహద్దుల్లో పరిస్థితులను సైనికులను అడిగి తెలుసుకున్నారు. అటు సిరియాపైనా ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్ వద్ద అనుకోకుండా ఓ మిజైల్ ఈజిప్ట్‌లోకి దూసుకెళ్లిందని ఇజ్రాయేల్ ప్రకటించింది. పొరపాటున దాడి జరిగినట్టు వెల్లడించింది. 


ఇజ్రాయేల్ అధ్యకుడి సంచలన వ్యాఖ్యలు


ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై దాడులకు రసాయన ఆయుధాలనూ (Chemical Weapons) వాడేందుకు సన్నద్ధమయ్యారని ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్‌ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు హెర్జోగ్‌. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్‌ డిస్పర్షన్‌ డివైజ్‌ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికిందన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్‌ ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్‌ సభ్యుల దగ్గర దొరికాయన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్‌ సెంటర్ల లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.


Also Read: నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన బైడెన్, ఆ తరవాత కీలక నిర్ణయం