Israel Palestine Attack:
నెతన్యాహుకి బైడెన్ ఫోన్ కాల్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. గాజా పరిసర ప్రాంతాల్లో పౌరులకు అన్ని విధాలుగా సాయం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అమెరికా పెద్ద ఎత్తున ఇజ్రాయేల్‌కి సాయం అందిస్తోంది. ఇకపైనా సాయం చేసేందుకు అగ్రరాజ్యం సిద్దంగా ఉందని బైడెన్ హామీ ఇచ్చారు. ఇదే విషయమై వైట్‌హౌజ్ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో బందీలైన ఇద్దరి అమెరికన్‌లను విడిపించడంలో ఇజ్రాయేల్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.
"అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా ఇజ్రాయేల్‌కి మానవతా సాయం అందిస్తోంది. అమెరికా తరపున రెండు కాన్వాయ్‌లు వెళ్లి పాలస్తీనా పౌరులకు సాయం అందిస్తుండడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. ఇదే విషయమై బైడెన్, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇకపైనా ఈ సాయం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు బంధించిన ఇద్దరు అమెరికన్లను విడిపించడంలో ఇజ్రాయేల్ చాలా సహకరించింది. ఇందుకు బైడెన్ నెతన్యాహుకి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా బందీలను విడిపించేలా చొరవ చూపించాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి."
- వైట్ హౌజ్ కార్యాలయం
మిగతా దేశాల మద్దతు..
గాజాలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం సూచించింది. ఇజ్రాయేల్ ప్రభుత్వం అక్కడి అమెరికా పౌరులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. వాళ్ల భద్రతకు భరోసా ఇస్తోంది. అమెరికాతో పాటు ఇజ్రాయేల్‌కి యూకే, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ కూడా మద్దతునిచ్చాయి. పాలస్తీనా ఉగ్రవాదులపై దాడులను సమర్థించాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరవాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ చర్చించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అన్ని దేశాలూ ఒక్కటవుతున్నట్టు ప్రకటించారు.