భారత్ కు పక్కలో బల్లెంలా మారిన డ్రాగన్ కంట్రీ చైనా భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగాన్ వెల్లడించింది. ఏడాదికేడాది భారీగా అణ్వాయుధాలను పెంచుకుంటోందని, వాటిని శత్రుదేశాలకు అనుమానం రాకుండా జాగ్రత్తపడుతోందని ఆరోపించింది. చైనా సైన్యంలో 2022లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలపై పెంటగాన్ కీలకమైన నివేదికను విడుదల చేసింది. 2021తో పోలిస్తే డ్రాగన్ అమ్ములపొదిలోకి 2022లో మరో 100 కొత్త వార్‌హెడ్లు చేరినట్లు తెలిపింది. చైనా వద్ద ప్రస్తుతం 500 అణు వార్‌హెడ్‌లు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని, 2030 నాటికి 1,000కి చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 2040 నాటికి మరిన్ని అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వెల్లడించింది.
భూగర్భ బొరియల్లో 300 ఖండాంతర క్షిపణులు
ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయని పెంటగాన్ వెల్లడించింది. మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించడానికి వీలుగా భూగర్భ బొరియలను 2022లో నిర్మించినట్లు నివేదికలో తెలిపింది. సంప్రదాయ వార్‌హెడ్‌లను ప్రయోగించే ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలను తీవ్రం చేసింది. విదేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలను డ్రాగన్ కంట్రీ ముమ్మరం చేసినట్లు అమెరికా రక్షణ శాఖ అనుమానిస్తోంది. బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, సాల్మన్ ఐలాండ్స్, తజకిస్థాన్ వంటి చోట్ల లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. నౌకాదళంలో ఏడాది కాలంలో 30 సరికొత్త యుద్ధనౌకలను చేర్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధనౌకలు చైనా వద్ద ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య 2025 నాటికి 395 చేరవచ్చని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తోంది.
వేగంగా అణ్వాయుధాలు అభివృద్ధి
అణ్వాయుధాలను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోందంటూ గతేడాది జనవరిలో అమెరికా రక్షణ శాఖ ఆరోపించింది. అప్పుడు అమెరికా చేసిన ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. తన అణు సంపదను దేశ భద్రతకు, అంతర్జాతీయ సుస్థిరతకు అవసరమైన స్థాయిలోనే ఉంచుకున్నట్లు తెలిపింది. అణు యుద్ధాలు జరగకుండా చూస్తామని భద్రతా మండలిలోని ఐదు సభ్య దేశాలు అంగీకారానికి రావడం చైనా వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చింది. ఆయుధ పోటీ ఉండకుండా తొలి ప్రకటన వెలువడే విషయంలో చైనా కీలకంగా వ్యవహరించిందని కితాబిచ్చుకుంది.
భారత్ సరిహద్దుల్లో భారీ ఎత్తున నిర్మాణాలు
మరోవైపు భారత్‌తో సరిహద్దుల వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్ తన నివేదికలో వెల్లడించింది. అండర్ గ్రౌండ్ స్టోరేజీలు, కొత్త రోడ్లు, సైనిక పౌర వినియోగానికి వీలుగా ఎయిర్ పోర్టులు, భారీ సంఖ్యలో హెలిప్యాడ్లు నిర్మిస్తోందని తెలిపింది. అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్‌గ్రౌండ్ స్టోరేజీ ఫెసిలిటీలను ఏర్పాటు చేసింది. భూటాన్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం చేపట్టింది. 2020లో భారత్-చైనా మధ్య ఘర్షణల తలెత్తిన తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీగా సైన్యాన్ని మోహరించినట్లు అమెరికా తెలిపింది.