Hamas Attacks: ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై దాడులకు రసాయన ఆయుధాలనూ వాడేందుకు సన్నద్ధమయ్యారని ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు హెర్జోగ్. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్ డిస్పర్షన్ డివైజ్ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికిందన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్ ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్ సభ్యుల దగ్గర దొరికాయన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్ సెంటర్ల లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్
హెజ్బొల్లా యుద్ధంలోకి వస్తే లెబనాన్ విధ్వంసాన్ని చవిచూడక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాము చేసే దాడులు ఊహించని విధంగా ఉంటాయని స్పష్టం చేశారు. లెబనాన్ సరిహద్దుల్లోని కమాండోలతో నెతన్యాహు మాట్లాడారు. సరిహద్దుల్లో పరిస్థితులను సైనికులను అడిగి తెలుసుకున్నారు. అదనపు బలగాల మోహరింపు, ఆయుధాల పరిస్థితిపై ఆరా తీశారు. గాజా యుద్ధంలోకి హెజ్బొల్లా పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనన్న ఆయన, అలా జరిగితే ఇజ్రాయల్ కు చావోరేవో అవుతుందన్నారు. గాజా సరిహద్దులో సిద్ధంగా ఉన్న సైన్యం భూతల దాడులపై రాజకీయ నిర్ణయం కోసం వేచి ఉంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి భూతల దాడులపై చర్చించారు. తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యే చర్యల్లో భాగంగానే దాడులు చేసిన ఐడీఎఫ్ ప్రకటించింది.
సిరియాపైనా బాంబుల వర్షం
మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. గాజా, వెస్ట్‌బ్యాంకుతో పాటు పొరుగు దేశం సిరియాపైనా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. లెబనాన్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ రోజూ దాడులు చేస్తోంది. ఇప్పటిదాకా గాజా, లెబనాన్‌కే పరిమితమైన దాడులు విస్తరించడంతో యుద్ధంలోకి పొరుగు దేశాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. గాజాపై విస్తృతంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. మిలిటెంట్లు ఉన్నారన్న కారణంతో వెస్ట్‌బ్యాంక్‌లోని మసీదుపైనా బాంబు దాడులు చేసింది. సిరియాలోని రెండు విమానాశ్రయాలపై బాంబులు ప్రయోగించింది. దీంతో రెండు వారాల కిందట ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కొత్త మలుపు తీసుకుంది.
గాజాకు భారత్ సాయం
గాజాలో బాధితుల కోసం 6.5 టన్నుల మెడిసిన్, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని భారత్ పంపింది. భారతీయ వాయుసేనకు చెందిన సీ-17 విమానం వాటిని తీసుకుని ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి వెళ్లింది. ఇందులో ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటిని శుద్ధి చేసే ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో 143 మందితో ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. అందులో ఇద్దరు నేపాలీలు, నలుగురు శిశువులు ఉన్నారు.