Maui Wildfire Death Toll: ఇహలోకపు స్వర్గంలా ఉండే హవాయి ద్వీపంలోని మౌయి దీవి ఇప్పుడు కాలి బూడిదైపోయింది. కార్చిచ్చు ఈ ప్రాంతంలో తీవ్రాతితీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ దీవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 99కి చేరింది. ఈ మంటల ధాటికి ఏకంగా 3 వేలకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయి. శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. వెయ్యి డిగ్రీల ఫారెన్‌హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోయాయి. 2 వేల 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. రిసార్టు నగరం లహైనా కూడా గుర్తు పట్టలేని స్థితికి మారిపోయింది. ఆ ఘోర ప్రకృతి విపత్తు వల్ల ఏకంగా 50 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగిన సమయంలో అధికారులు ప్రజల సెల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం పంపారని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రమాదాన్ని చేరవేసినప్పటికీ అది అందరికీ చేరలేదని సమాచారం. 


99 మంది మృతుల్లోనూ ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే వేలిముద్రల ఆధారంగా గుర్తించగలిగారు మౌయి పోలీసు అధికారులు. మృతులను వేగంగా గుర్తించేందుకు వీలుగా డీఎన్ఏ నమూనాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని  స్థానికులను కోరారు. లహైనాలో 1300 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. హవాయి రాష్ట్రం చవిచూసి ఈ అతిపెద్ద ప్రకృతి విపత్తు గురించి అధికారులు సన్నద్ధత, స్పందనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రారంభ దశలో కొన్ని అగ్నిమాపక పైపులైన్లలో నీళ్లు లేకుండా పోయినట్లు స్థానికులు అంటున్నారు. పౌరులను అప్రమత్తం చేసేందుకు సైరన్ వంటి హెచ్చరికలనూ ఉపయోగించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మంటలు సమీపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే చాలా మందికి వాటి గురించి తెలిసి పరుగు పెట్టారని, వారిని చూసి మరికొందరు దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 


Also Read: Minister KTR: వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే! ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి: కేటీఆర్


2 వేలకు పైగా నిర్మాణ సముదాయాలు బూడిదయ్యాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు పలువురు పిల్లలతో సహా పసిఫిక్ సముద్రంలోకి దూకారు. అందులో కొంత మందిని కోస్ట్ గార్డ్స్ రక్షించగలిగారు. మౌయి విమానాశ్రయం నుంచి పర్యాటకులను తరలించారు. అమెరికా నేషనల్ గార్డ్స్, నౌకా దళం, మెరైన్, కోస్ట్ గార్డ్స్ ను రంగంలోకి దించి సహాయ చర్యలు చేపడుతున్నారు. అమెరికా చరిత్రలో గత 105 ఏళ్లలో ఈ తరహా అతి భీకరమైన కార్చిచ్చు సంభవించలేదు. హవాయి ప్రాంతం ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తుగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని గవర్నర్ గ్రీన్ వెల్లడించారు. 1918లో మిన్నెసోటా, విస్కాన్సిన్ ప్రాంతం సంభవించిన కార్చిచ్చుకు 453 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,200 భవనాలు బూడిద అయ్యాయి. 6 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. మౌయిలో చెలరేగిన ఈ కార్చిచ్చుకు కారణం ఏమిటి అనేది ఇప్పటి వరకు తేలలేదు. వేసవిలో ఎండిపోయిన ఆకులు, చెట్లకు నిప్పు అంటుకుని గాలుల ప్రభావంతో ఆ మంట వేగంగా వ్యాపించిన ఇంతటి ఘోర విపత్తుకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.