Minister KTR: సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించిన కేటీఆర్.. ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సారంపల్లిలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్.. అభివృద్ధి జరుగుతున్న సమయంలో తప్పు చేయవద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని, ఈ సమయంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లి వేరేటోళ్ల చేతిలో పెట్టి ఆగం కావొద్దంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర సర్కారు కాపీ కొడుతోందని మంత్రి అన్నారు.
తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు బంధు ప్రవేశపెడితే.. కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ పేరిట అలాంటి పథకాన్నే కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తోందని తెలిపారు. ఇక్కడ మిషన్ భగీరథ తీసుకువస్తే.. కేంద్రం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం.. వచ్చే ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు మీ దయతోనే నాలుగు సార్లు గెలిచానని.. మరోసారి గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా అని హామీ ఇచ్చారు. కడుపులో పెట్టుకొని చూసుకోండి అని కోరారు. తనను గెలిపిస్తే ఓ అన్నగా, తమ్మునిగా మంచి పనులు చేస్తానన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, హన్మాజీపేట్, దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించారు. మంత్రి కేటీఆర్ ఆ ఆవిష్కరణలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను అభినందించారు.
అంతకు ముందు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. జిల్లాలో 172 కాలేజీల్లో సకల వసతులు కల్పించినట్లు తెలిపారు. ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయని అన్నారు. మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రానిదే సింహభాగమని కేటీఆర్ తెలిపారు.