Independence Day 2023: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశం గురించి పలు అంశాలు ప్రస్తావించి దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని 10 కీలక పాయింట్లు చూద్దాం.


మణిపూర్ సమస్యకు పరిష్కారం శాంతి మార్గం ద్వారా మాత్రమే కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ పరిష్కారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి మోదీ తెలిపారు.


ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేసే త్యాగాలు రాబోయే వెయ్యేళ్లపై ప్రభావం చూపిస్తాయని ప్రధాని అన్నారు. భారత్ కొత్త విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం సహ అన్ని కలలను సాకారం చేసుకోగల సామర్థ్యం దేశానికి ఉందన్నారు. 


పరిమితులు, సాకులు లాంటివేవీ లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రధాని తెలిపారు. వృద్ధి, పురోగతి వల్ల భారతదేశంపై ప్రపంచ దేశాల అభిప్రాయం మారిందని అన్నారు. ప్రపంచం సాంకేతికత ఆధారితమైనదని, సాంకేతికతలో భారత్ తన ప్రతిభతో ప్రపంచ వేదికపై కొత్త పాత్రను పోషిస్తుందని, మరింత ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.


అవినీతి, వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలు భారతదేశానికి ప్రధాన అడ్డంకులని అన్నారు ప్రధాని మోదీ. అచంచల విశ్వాసమే భారతదేశ అతిపెద్ద బలమని అన్నారు.


భారత్ లో వరుసగా పేలుళ్లు జరిగే రోజులు పోయాయని స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ అన్నారు. నేడు దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని, నక్సల్స్ పీడిత ప్రాంతాల్లో కూడా భారీ మార్పు వచ్చినట్లు చెప్పారు.


భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, తన పరుగును ఆపదని ప్రపంచ నిపుణులు, రేటింగ్ ఏజెన్సీలు కొనియాడుతున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. మారుతున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో భారతీయల సామర్థ్యాలు స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు.


దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం అవసరమని 2014లో ప్రజలు నిర్ణయించినట్లు పీఎం అన్నారు. భారత్ అస్థిరత శకం నుంచి 2014లో విముక్తి పొందారు. 


ఒక విదేశీ పర్యటనలో భారత్ లోని అమ్మాయిలు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో పాల్గొంటారా అని కొందరు తనను అడిగినట్లు గుర్తు చేశారు ప్రధాని. భారత్ లో STEM(సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్)లో అబ్బాయిల కంటే ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారని అప్పుడు వారికి చెప్పినట్లు మోదీ అన్నారు. 2 కోట్ల లక్షాధికారిణిలను తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు మోదీ.


Also Read: Mallikarjun Kharge: ఎర్రకోట వేడుకకు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరు, ఖాళీ కుర్చీల ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్


కరోనా మహమ్మారి సమయంలో 200 కోట్ల టీకాలు వేశామని.. అంగన్ వాడీ, ఆరోగ్య కార్యకర్తల వల్లే ఇదంతా సాధ్యమైందని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. అత్యంత వేగంగా దేశంలో 5జి ని ప్రారంభించుకున్నామని, ఇప్పుడు 6జి కి సిద్ధం అవుతున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించినట్లు వెల్లడించారు. గడువు కంటే ముందే తన లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసుకుందన్నారు. 


అంతరిక్షం నుంచి లోతైన సముద్ర ప్రయోగాలు, వందే భారత్ రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో రైళ్లు, గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం, సెమీకండక్టర్ల తయారీ ఇలా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నట్లు భారత ప్రధాని తెలిపారు. భారత్ తన లక్ష్యాల దిశగా పయనిస్తోందన్నారు.