Chandrayaan-3: చంద్రయాన్-3ని చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భావిస్తోంది. అమెరికా, రష్యా, చైనాల సరసన చేరి, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రుని ఉపరితలంపై రెండో సారి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి యత్నిస్తోంది. 2019 చంద్ర మిషన్, చంద్రయాన్-2 తరువాత ఈ ప్రయోగం చేస్తోంది. ఇది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్ కోసం ఇస్రో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవనుంది. ఇప్పటికే అంతరిక్ష నౌక ఇటీవల చంద్రుడి దూరంలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండింగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే.


చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్ధారించడానికి వివిధ ఎలక్ట్రానిక్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్‌ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్-సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రధాన లక్షాలు మొదటగా సురక్షిత ల్యాండింగ్ చేయడం, చంద్రుడిపై రోవర్‌ను దించడం, ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు చేయడమే. 


చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ కొంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్ విఫలమడంతో శాష్త్రవేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.  


చంద్రయాన్-1 మిషన్ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది.  ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ కోల్పోవడంతో మిషన్ ముగిసింది. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ గత వారం చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండింగ్ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు. 


ఇస్రో మాజీ డైరెక్టర్ శివన్ గతంలో మాట్లాడుతూ.. మిషన్ చంద్రయాన్-3 విజయం భారతదేశపు మొట్ట మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ వంటి కార్యక్రమాలకు ధైర్యాన్ని ఇస్తుందన్నారు. దేశ అంతరిక్ష రంగం ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవుతుందని భారతదేశానికి గేమ్-ఛేంజర్ అవుతుందన్నారు.  


భారతీయ రాకెట్లన్నింటిలో ప్రధానమైన 'వికాస్ ఇంజిన్'ను అభివృద్ధి చేయడం, దేశం PSLV రాకెట్ల యుగంలోకి ప్రవేశించడంలో కీలకంగా పని చేసిన శాస్త్రవేత్త నారాయణన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 విజయవంతం అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. చంద్రయాన్-2లో వచ్చిన ప్రతి సమస్యలను అధ్యయనం చేశామని, వాటిని సరిదిద్దుతూ చంద్రాయాన్-3 రూపొందించినట్లు చెప్పారు. 


చరిత్ర పరంగా చూస్తే అంతరిక్ష నౌకలు ప్రధానంగా ఆపరేట్ చేయడానికి అనుకూలంగా ఉండేందుకు చంద్రుని మధ్యరేఖ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే భూమధ్యరేఖ ప్రాంతంతో పోలిస్తే చంద్ర దక్షిణ ధ్రువం చాలా భిన్నమైనది, మరింత సవాలుతో కూడుకున్నది. నిర్దిష్ట ధ్రువ ప్రాంతాలలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా ఉష్ణోగ్రతలు -230 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని శాశ్వత చీకటి ప్రాంతాలు ఉంటాయి. ఈ సూర్యకాంతి లేకపోవడం, విపరీతమైన చలి అంతరిక్ష నౌకల ఆపరేషన్, స్థిరత్వానికి ఇబ్బందులు కలిగిస్తాయి. 


చంద్రుని దక్షిణ ధ్రువం మానవులకు, అంతరిక్ష నౌకలకు సవాళ్లను విసురుతుంది. అయితే ఇది ప్రారంభ సౌర వ్యవస్థ గురించి విలువైన సమాచారం తెలుసుకోవడానికి దోహదంచేస్తుంది. భవిష్యత్తులో లోతైన అంతరిక్ష అన్వేషణను ప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని అన్వేషించడం చాలా కీలకం.