China Population: జనాభా అనే మాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు చైనా. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకొచ్చింది. అదేంటంటే చైనాలో జనాభా భారీగా తగ్గుముఖం పడుతోంది.


గణాంకాలు


చైనా జనాభా 2021లో 141.21 కోట్ల నుంచి 141.26 కోట్లకు చేరినా పెరిగింది కేవలం 4,80,000 మందేనని చైనా జాతీయ గణాంకాల విభాగం తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2029 నాటికి తమ దేశ జనాభా 144 కోట్లకు చేరుతుందని 'షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌' 2019లో అంచనా వేసింది. 2021 తర్వాత జనాభా క్షీణత 1.1 శాతంగా ఉంటుందని.. 2100 నాటికి అనూహ్యంగా 58.7 కోట్లకు పడిపోతుందని అభిప్రాయపడింది.


భారత్‌లో కూడా


ఇదే సమయంలో భారత జనాభా కూడా తగ్గుతుందని అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఇప్పుడున్న 138 కోట్ల నుంచి 109 కోట్లకు తగ్గిపోతుందని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచ జనాభాలో నంబర్‌వన్‌గా ఉంటుందని తెలిపింది.


ఐరాస లెక్కలు


భారత్‌, చైనాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. 2100 నాటికి భారత జనాభా 144.7 కోట్లకు చేరుతుందని.. 106.5 కోట్లతో చైనా రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (73.3 కోట్లు), అమెరికా (43.4 కోట్లు), పాకిస్థాన్‌ (40.3 కోట్లు) ఉంటాయని తెలిపింది.


అలా చేస్తే


60 ఏళ్ల కింద తీవ్ర కరువు సంభవించిన సమయం(1959-61)లో మాత్రమే చైనాలో జనాభా తగ్గింది. ఆ తర్వాత గత నాలుగు దశాబ్దాల్లో 66 కోట్ల నుంచి ఏకంగా 141 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు తగ్గుముఖం పట్టడానికి కూడా కారణాలున్నాయని చైనా అధికారులు చెబుతున్నారు.


ఒకే బిడ్డ విధానాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎత్తివేసినా సామాజిక, ఆర్థిక కారణాల దృష్ట్యా ఎక్కువ మందిని కనేందుకు మహిళలు సుముఖత చూపడం లేదని షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ వెల్లడించింది.


ముఖ్యంగా కరోనా నియంత్రణకు చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ కారణంగా గర్భధారణకు మహిళలు ఇష్టపడడం లేదు. అయితే ఇదొక్కటే జనాభా మందగమనానికి కారణం కాదు. చాలా ఏళ్లుగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.


ఇతర కారణాలు



  • చిన్న కుటుంబాలకు అలవాటు పడిన వారు పెద్ద కుటుంబాలుగా ఎదిగేందుకు సుముఖంగా లేరు.

  • జీవన వ్యయం పెరిగిపోయింది.

  • వివాహ వయసు పెంచడంతో జననాలు ఆలస్యమవుతున్నాయి.

  • పిల్లలను కనాలన్న కోరిక తగ్గిపోతోంది.

  • సంతానం పొందే వయసు గల మహిళల సంఖ్య చైనాలో బాగా తగ్గిపోయింది.

  • అలాగే పనిచేసే వయస్కుల సంఖ్య తగ్గిపోయి 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది.


తగ్గుదల కూడా సమస్యే


పనిచేసే వయస్కుల శాతం 1.73 శాతానికి తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందుకు తగినట్లుగా ఉత్పాదకత వేగం పుంజుకోకుంటే ఎకానమీ బాగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.


కార్మికుల సంఖ్య తగ్గిపోతే.. కార్మిక వ్యయం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఉత్పాదక యూనిట్లు.. కార్మిక వ్యయం చౌకగా ఉండే భారత్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు వెళ్లిపోతాయి.


అంతేకాకుండా పెరిగిపోతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా తన ఉత్పాదక వనరుల్లో అత్యధిక భాగాన్ని వారి ఆరోగ్యం, వైద్యం, సంరక్షణ సేవలకు వెచ్చించాల్సి ఉంటుంది.


Also Read: Satyendar Jain: ఈడీ కస్టడీకి దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్- కోర్టు కీలక ఆదేశాలు


Also Read: UPSC Final Result 2021: పేరులోనే కాదు పోరాటంలో కూడా 'శివంగే'- UPSCలో 177వ ర్యాంకర్ కథ విన్నారా?