పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న షెహబాజ్ షరీఫ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. చితికిపోయిన దేశ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడం ఆయన ముందున్న మొదటి సవాల్. మరోవైపు అమెరికాతో తిరిగి బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం రెండో సవాల్. మరి వీటిని షెహబాజ్ సాధిస్తారా..


ఆర్థిక స్థితి


పాకిస్థాన్ ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉంది. ఈ అప్పులు ఇప్పుడు కొత్తగా చేసినవా? అంటే కొన్ని పాత అప్పులే. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా మారిన తర్వాత చేసిన అప్పులు మరికొన్ని ఉన్నాయి. పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట.


ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. ఆ మేరకు అప్పులు కూడా పెరిగాయి.


మరి ఇప్పుడు కొత్త ప్రధాని షెహబాజ్.. పాకిస్థాన్‌ ఆర్థిక స్థితిని ఏమేరకు మార్చగలరో చూడాలి.


అమెరికాతో


అమెరికా, షరీఫ్ కుటుంబం కలిసి తన ప్రభుత్వాన్ని పడగొట్టాయని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇప్పుడు యూఎస్‌తో సంబంధాలను పునరుద్ధరించడం షెహబాజ్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్.


భారత్‌తో


పాకిస్థాన్‌కు కొత్త ప్రధాని వచ్చిన ప్రతిసారి 'కశ్మీర్' సమస్య తెరపైకి వస్తుంది. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్‌ కంటే.. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్‌ షరీఫ్‌ హయాంలో భారత్‌ - పాక్‌ సంబంధాలు ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


షెహబాజ్‌కు సన్నిహితుడైన పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ నేత సమీవుల్లాఖాన్‌ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్‌ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్‌ సోదరుడైన నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధాని హోదాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.


ఆరోగ్యం


పంజాబ్‌ రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో షెహబాజ్ పనితనం చాలా గొప్పగా ఉండేది. ప్రతిష్ఠాత్మకమైన చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంలో చైనా ప్రశంసలు అందుకున్నారు షెహబాజ్. కానీ ఇప్పుడు షెహబాజ్ ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేదు. 2018లో అపెండిక్యులర్ అడెనోకార్సినోమా సహా అనేక వ్యాధులకు ఆయన చికిత్స చేయించుకున్నారు. మరి ఇప్పుడు ప్రధానిగా ఏం చేస్తారో చూడాలి.


Also Read: Pakistan New PM: పాకిస్ధాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్- ఆయనలో ఇదే హైలెట్!


Also Read: National Herald Case: ప్రతిపక్ష నేతలకు ఈడీ వరుస షాక్‌లు- ఆ కేసులో ఖర్గేను ప్రశ్నించిన అధికారులు