మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్ తగిలింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక అవినీతి కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నించారు.


ఏమడిగారు?


నేషనల్ హెరాల్డ్ పత్రిక విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఖర్గేను పిలిచినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ మధ్య ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలకు ఈడీ వరుస షాక్‌లు ఇస్తోంది. ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.


ఇదే కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు. 


మరో కేసు


అగస్టా వెస్ట్​లాండ్ చాపర్ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్ శశికాంత్ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు పంపింది. వాయుసేనకు చెందిన నలుగురు విశ్రాత అధికారులతో పాటు సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్​షీట్​లో ఉన్న నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. నిందితులంతా ఏప్రిల్ 28న తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.


Also Read: Gujarat News: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- ఆరుగురు కార్మికులు మృతి


Also Read: Jharkhand Ropeway Accident: రోప్‌వేలో కేబుల్ కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి- చిక్కుకుపోయిన 42 మంది