ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దియోఘర్ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. దాదాపు 42 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రంగంలోకి
చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం, వాయుసేన, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. 42 మంది కేబిన్‌లలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
ఏంటి కారణం?
ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యటకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ దగ్గర్లోనే బైధ్యనాథ్ ఆలయం కూడా ఉంది. అయితే రోప్‌వేలో ఆకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కేబుల్ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో రోప్‌వేలో వెళ్తున్న మిగతా కార్లు పరస్పరం ఢీకొన్నాయి. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
ఈ ఘటన జరిగిన సమయంలో రోప్వేకు సంబంధించిన 19 కేబుల్ కార్లలో 70 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. ఇందులో కొంతమందిని అధికారులు కాపాడారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Gujarat News: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- ఆరుగురు కార్మికులు మృతి
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి