కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీఎస్‌పీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ కూడా అదే బాటలోనే నడుస్తున్నారన్నారు.
రాహుల్ ఏమన్నారు?
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ చీఫ్ మాయావతితో కూటమి కోసం ప్రయత్నించినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఆమెకు సీఎం పదవి ఆఫర్ చేయగా.. కనీసం మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. దళితుల కోసం మాయావతి నిలబడలేదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, పెగాసస్ వంటి వాటికి ఆమె భయపడ్డారన్నారు.
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
Also Read: Watch Video: 'ధూమ్' లెవల్‌లో చేజింగ్- రన్నింగ్ వాహనం నుంచే ఆవులను తోసేసిన దొంగలు, వీడియో చూశారా?
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి