దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. గుజరాత్, బంగాల్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. గుజరాత్, ఝార్ఖండ్‌లలో ఒకరు చొప్పున మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గుజరాత్
గుజరాత్‌లోని హిమ్మత్ నగర్, ఖాంభాత్ జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. శ్రీరాముడి ఊరేగింపులో దుండగులు రాళ్లు రువ్వారు. ఐదు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. హింసను అదుపు చేయడానికి పోలీసులు ఏడు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
బంగాల్
బంగాల్‌లో కూడా పలుచోట్ల శ్రీరాముని శోభాయాత్రపై దుండగులు రాళ్లు రువ్వారు. బంకురాలో తన కారుపై కూడా రాళ్లు రువ్వినట్లు కేంద్ర మంత్రి డా. సుభాశ్ సర్కార్ తెలిపారు.
మచంతలా పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మసీదు వైపు వస్తోన్న శోభాయాత్రను దారి మళ్లించాలని పోలీసులు కోరారు. ఇందుకు నిర్వాహకులు నిరాకరించడంతో రాళ్ల దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఖర్గోన్ జిల్లాలో రామనవమి ఊరేగింపుపైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. వేరొక వర్గానికి చెందిన కొందరు.. ఊరేగింపులో పెట్టిన డీజే శబ్దాలకు అభ్యంతరం చెప్పారని.. ఇదే ఘర్షణకు దారితీసిందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నగరమంతా 144 సెక్షన్ విధించారు. మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లు సహా 24 మంది గాయపడ్డారు.
ఝార్ఖండ్
ఝార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలోనూ శ్రీరాముడి ఊరేగింపులో ఉద్రిక్త ఘటనలు తలెత్తాయి. ఆదివారం హిరాహి-హెంద్లాసో గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులపై కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం తొక్కిసలాట జరిగింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడం వల్ల.. ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పన్నెండుకు పైగా బైక్‌లు, ఓ పికప్ వ్యాన్‌కు దుండగులు నిప్పంటించారు.
భోగతా గార్డెన్లో రెండు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. జిల్లా ఎస్పీ, కలెక్టర్.. ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
Also Read: Gujarat News: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- ఆరుగురు కార్మికులు మృతి
Also Read: Barley: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు