ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొంత మందిని తీసేసి కొత్త వారికి చాన్సిచ్చారు. అలా పదవులు కోల్పోయిన వారిలో సీఎం జగన్‌పై అత్యంత విధేయత ప్రదర్శించి పార్టీ స్టాండ్‌కు అనుగుణంగా ప్రత్యర్థులపై విరుచుకుపడే పేర్ని నాని, కొడాలి నాని వంటి వారున్నారు. సుచరిత లాంటి విధేయులున్నారు. వారి విషయంలో హైకమాండ్ ఎందుకు శీతకన్నేసింది? వారికి ఎక్కడ మైనస్ అయింది ? 


కొడాలి నానికి బెర్త్ ఎందుకు మిస్సయింది !


ఏపీలో కొడాలి నాని మంత్రి కాదు అంటే చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో విపక్షాలపై రాజకీయం చేశారు. పౌరసరఫరాల మంత్రిగా ఉన్నా.. ఆయన తన శాఖపై ఎప్పుడూ సమీక్షలు చేయడం.. మాట్లాడటం లాంటివి చేయలేదని విమర్శలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ టీడీపీపైకి ముఖ్యంగా చంద్రబాబుపై ధూషణల రాజకీయంలో చేయడంలో మాత్రం ఆయన ఎవర్నీ నిరాశపర్చలేదు. హైకమాండ్ ఎలా విమర్శించమంటే అలా విమర్శించేవారు.  జగన్‌పై అత్యంత విధేయత చూపేవారు.  జగన్ కారు డ్రైవర్‌గా పని చేయడానికి కూడా సిద్ధమని చెప్పేవారు. అలాంటిది ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి అవసరం లేదని జగన్ భావించారని అందుకే ... ఇబ్బంది అియనా తప్పించారని అంటున్నారు.  స్టేట్ డవలప్‌మెంట్ బోర్డు పెట్టి దానికి చైర్మన్ ను చేస్తామని చెప్పారు కానీ..కేబినెట్ మంత్రికి.. కేబినెట్ హోదాకు తేడా ఉంటుందని కొడాలి నానినే వ్యాఖ్యానించారు. కారణం ఏదైనా కొడాలి నాని మాత్రం నిరాశే ఎదురయింది. 


పేర్ని నాని చేసిన తప్పేంటి!?


సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని తన శాఖతో పాటు రాజకీయాలపైనా సమర్థంగా పని చేశారని చెప్పుకోవచ్చు.  మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సమర్థించడంలో ఆయన స్టైల్ వేరు. ఆయన మంచి వాగ్ధాటి ఉన్న నేత . ఆయనను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు.   ఆయన స్వయంగా తాను ైఎస్ కుటుంబానికి పెద్ద పాలేరునని ప్రకటించుకున్నారు.  పార్టీకి.. ప్రభుత్వానికి తలలో నాలుకలా వ్యవహరించారు. ఆయన పదవిని ఎందుకు తప్పించారన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయం అనుకోవచ్చు.  పవన్ కల్యాణ్‌పై  విరుచుకుపడటంలో ఆయన స్టైలేవేరు. 


విధేయత చూపినా అవమానించారని సుచరిత కినుక !


హోంమంత్రి సుచరిత జగన్‌కు అత్యంత విధేయురాలు. అయితే అలా విధేయత చూపించినందుకే అవమానించారని ఇప్పుడు ఫీలవుతున్నారు. హోంమంత్రిగా  ఉన్నా... తనకు పెద్గగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా... పట్టించుకోలేదు. పార్టీ స్టాండ్ ప్రకారం.. సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే అవి పాటించారు. కానీ చివరికి ఆమె పదవి మిస్సయింది. 


కారణాలేమైనప్పటికీ.... ఏపీలో మూడేళ్ల పాటు మంత్రులు అంటే పదే పదే తెర ముందుకు వచ్చిన ఇద్దరు నానిలు ఇప్పుడు తెర వెనక్కి వెళ్లాల్సిందే. వారికి ఏ ఇతర పదవులు ఇచ్చినా మంత్రి పదవులతో సాటి రావు. ఆ నానిలను జగన్ ఎందుకు దూరం చేసుకున్నారో వైఎస్ఆర్‌సీపీలో నేతలకే అంతుబట్టని పరిస్థితి.