మొత్తం 6 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 రాజ్యసభ స్థానాల భర్తీకి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల నిర్వహణకు మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.


ఏప్రిల్ 2న అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ పొందనున్నారు. అలాగే పంజాబ్‌ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. పదవీ విరమణ పొందే వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. 


ఏ రాష్ట్రంలో


13 రాజ్యసభ స్థానాల్లో పంజాబ్‌ నుంచి ఐదు, కేరళ నుంచి మూడు, అసోం నుంచి రెండు, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, త్రిపుర నుంచి ఒక్కొక్క స్థానం చొప్పున భర్తీ చేయనున్నారు.


భాజపా బలం


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట గెలిచిన భాజపా.. రాజ్యసభ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. 13 స్థానాల్లో కనీసం ఐదు స్థానాల్లో గెలుపొందాలని వ్యూహాలు రచించింది. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో భాజపాకు 97 మంది సభ్యులు ఉన్నారు.


ఫేర్‌వెల్


మరోవైపు రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న వివిధ పార్టీలకు చెందిన 72మంది ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు పలికారు. వీరంతా మరోసారి సభకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చదువు ద్వారా పొందిన జ్ఞానం కంటే అనుభవం ద్వారా వచ్చే జ్ఞానమే శక్తిమంతమైందని సభ్యులను ఉద్దేశించి మోదీ అన్నారు. 






రాజ్యసభ సభ్యుడిగా పొందిన అనుభవాన్ని ప్రజలకు తెలియజేయాలని ఎంపీలకు మోదీ సూచించారు. పదవీ కాలం పూర్తయిన 72 మంది సభ్యులతో మోదీ ఫొటోలు దిగారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పాల్గొన్నారు.



Also Read: Sergey Lavrov India Visit: ఉక్రెయిన్ ఉద్రిక్తతల వేళ భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన


Also Read: Heart Health: రోజూ మీరు చేసే ఈ పనులు గుండెను దెబ్బతీస్తాయి, వెంటనే మానేయండి