ఆయన మాట్లాడితే స్పీకర్లు పగిలిపోతాయి.. మైకులు ఎగిరిపోతాయి.. అవును పాకిస్థాన్ 'ఆవేశం స్టార్'గా పేరుపొందిన ఆయనే షెహబాజ్ షరీఫ్. పాకిస్థాన్ ప్రతిపక్షాలు తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్‌ను ఆదివారం నియమించాయి.
ప్రతిపక్షాలకు జాతీయ అసెంబ్లీలో సంఖ్యా బలం ఉండటంతో షెహబాజ్.. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఆయన గురించి తెలుసుకుందాం.
ఎవరంటే?
మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు.
షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వీటన్నింటిని మించి షెహబాజ్ ప్రసంగాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయంలో చేతులను చాలా వేగంగా కదిలిస్తారు. అంతేకాకుండా చాలా ఆవేశంగా మాట్లాడతారు. చాలా సార్లు ఆయన మాట్లాడే సమయంలో ముందు ఉన్న మైకులను కూడా పడేస్తుంటారు.
కృతజ్ఞతలు
తనను ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా, పౌరులు రాజ్యాంగానికి మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పాకిస్థాన్ పార్లమెంటు తాత్కాలిక స్పీకర్ అయాజ్ సాదిక్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నూతన ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు సోమవారం నేషనల్ అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందన్నారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి