Canada Wildfire: హవాయి దీవుల సమూహంలోని మౌయి ద్వీపాన్ని కార్చిచ్చు దహించి వేసిన విషయం తెలిసిందే. లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు బూడిదను మిగిల్చింది. గతవారం కార్చిచ్చు సృష్టించిన విలయానికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2 వేలకుపైగా నివాసాలు ఖాళీ బూడిదయ్యాయి. వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి విపత్తు ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు కెనడా వైపు మరో కార్చిచ్చు వేగంగా దూసుకొస్తోంది. కెనడాలోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. ఈ కార్చిచ్చు నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లో నైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది. ఎల్లో నైఫ్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 


ఎల్లోనైఫ్ నగరంలో దాదాపు 20 వేల మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రజలను తరలించేందుకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఆ నగర మేయర్ తెలిపారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో వీలైనంత వరకు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని.. వాహనంలో ఖాళీ ఉంటే.. ఇతరులను ఎక్కించుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఎల్లోనైఫ్ నగరంతో పాటు హే రివర్ పట్టణాన్ని కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. బలమైన గాలుల వల్ల కార్చిచ్చు అతి వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


హవాయి మౌయి దీవిలో కార్చిచ్చు


ఇహలోకపు స్వర్గంలా ఉండే హవాయి ద్వీపంలోని మౌయి దీవి ఇప్పుడు కాలి బూడిదైపోయింది. కార్చిచ్చు ఈ ప్రాంతంలో తీవ్రాతితీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ దీవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు పైగా చేరింది. ఈ మంటల ధాటికి ఏకంగా 3 వేలకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయి. శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. వెయ్యి డిగ్రీల ఫారెన్‌హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోయాయి. 2 వేల 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. రిసార్టు నగరం లహైనా కూడా గుర్తు పట్టలేని స్థితికి మారిపోయింది. ఆ ఘోర ప్రకృతి విపత్తు వల్ల ఏకంగా 50 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగిన సమయంలో అధికారులు ప్రజల సెల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం పంపారని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రమాదాన్ని చేరవేసినప్పటికీ అది అందరికీ చేరలేదని సమాచారం. 


Also Read: First Biodiversity Village: దేశంలోనే తొలి జీవవైవిధ్య గ్రామం అట్లాస్ లాంచ్ చేసిన గోవా సర్కారు


లహైనాలో 1300 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. హవాయి రాష్ట్రం చవిచూసి ఈ అతిపెద్ద ప్రకృతి విపత్తు గురించి అధికారులు సన్నద్ధత, స్పందనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రారంభ దశలో కొన్ని అగ్నిమాపక పైపులైన్లలో నీళ్లు లేకుండా పోయినట్లు స్థానికులు అంటున్నారు. పౌరులను అప్రమత్తం చేసేందుకు సైరన్ వంటి హెచ్చరికలనూ ఉపయోగించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మంటలు సమీపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే చాలా మందికి వాటి గురించి తెలిసి పరుగు పెట్టారని, వారిని చూసి మరికొందరు దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.