First Biodiversity Village: ప్రకృతి ఎంతో ప్రత్యేకమైనది. ఎంతో వైవిధ్యమైనది. రకరకాల మొక్కలు, ఎన్నో రకాల జంతువులు, మరెన్నో రకాల జీవరాశులు, లక్షలాది రకాల్లో ఉండే ఈ వైవిధ్యం అంతా ప్రకృతిలో ఓ భాగం. ఇలాంటి విభిన్న అంశాల జీవి వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. జీవ వైవిధ్యంతోనే ఈ ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఒక్కటి తక్కువైనా, ఎక్కువైనా మొత్తం జీవనంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆధునికీకరణ ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఇప్పుడు బయో డైవర్సిటీకి పెద్ద పీట వేస్తున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకృతికి, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా బయో డైవర్సిటీని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతున్నాయి. 


జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో గోవా రాష్ట్ర సర్కారు ఎంతో ముందుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బయో డైవర్సిటీని కాపాడుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా దేశంలోనే తొలి జీవ వైవిధ్య గ్రామ అట్లాస్ ను ఆవిష్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. బుధవారం ఉత్తర గోవాలోని బయోడైవర్సిటీ అట్లాస్ ఆఫ్ మాయెమ్ ను విడుదల చేశారు. ఇది దేశంలోని మొదటి విలేజ్ అట్లాస్. మాయెం వైగునిం గ్రామ పంచాయతీ, బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ, మాయెం వైగునిమ్, మాయెం పాన్‌లోట్ సంఘ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. రాష్ట్రంలోని మొత్తం 191 పంచాయతీల బయోడైవర్సిటీ అట్లాస్ ను ప్రభుత్వం త్వరలోనే ఆవిష్కరిస్తుందని ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి, నిర్వహించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని సీఎం సావంత్ హామీ ఇచ్చారు. 


'మన జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, భవిష్యత్ తరాల కోసం దానిని నిర్వహించడం మన కర్తవ్యం. జీవవైవిధ్యాన్ని స్థిరమైన పద్ధతిలో ఉపయోగించడం అంటే.. సహజ వనరులను ఉపయోగించడం. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల ప్రజలు బాధపడొద్దు. జీవ వైవిధ్య పరిరక్షణకు యువత ముందుకు రావాలి. లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తాం. గ్రామస్థుల ద్వారానే జీవవైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. బయో డైవర్సిటీని ధ్వంసం చేయకూడదు. దాన్ని మనం కాపాడుకోవాలి. గ్రామంలోని జీవ వైవిధ్యం నాశనం అవుతోందా.. లేదా.. అనే దానిపై నిఘా ఉంచాల్సిన బాధ్యత కూడా స్థానిక పంచాయతీ సభ్యులపై ఉంటుంది' అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు.


Also Read: Chandrayaan-3: స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి విడిపోనున్న ల్యాండర్ విక్రమ్, నేడే కీలక దశ


మన పూర్వీకులు జీవ వైవిధ్యం ప్రాముఖ్యతను తెలుసుకుని నడుచుకున్నారని, దానిని కాపాడి మనకు అందించారని సీఎం సావంత్ అన్నారు. ఇప్పుడు దానిని భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిన బాధ్యతపై మనందరిపై ఉందని ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు.