Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. నిన్న చంద్రుడికి దగ్గరగా ఉండే 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. నేడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ సపరేషన్ జరిగింది. చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి అయిపోయి ఈ రోజు నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరు పడింది. ఇలా విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని బట్టి క్రమంగా చంద్రుని ఉపరితలానికి దగ్గరవుతుంది. అలా ఆగస్టు 23వ తేదీన జాబిలిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అలా స్మూత్ ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్లు. నిన్న చివరి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3.. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. సరిగ్గా మరో వారంలో చంద్రయాన్-3 చంద్రుడిని చేరుతుంది. అనుకున్నది అనుకున్నట్లు, ప్రణాళికాబద్ధంగా జరిగితే చంద్రయాన్-3 విజయవంతం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవనుంది. ఇప్పటికే అంతరిక్ష నౌక ఇటీవల చంద్రుడి దూరంలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండింగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే.
చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్ధారించడానికి వివిధ ఎలక్ట్రానిక్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్‌ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్-సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రధాన లక్షాలు మొదటగా సురక్షిత ల్యాండింగ్ చేయడం, చంద్రుడిపై రోవర్‌ను దించడం, ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు చేయడమే.
చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ కొంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్ విఫలమడంతో శాష్త్రవేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.
చంద్రయాన్-1 మిషన్ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది. ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ కోల్పోవడంతో మిషన్ ముగిసింది. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ గత వారం చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండింగ్ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు.