Apple Prices: మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కల్ని చూపించాయి. సామాన్యులు కొనలేని విధంగా రూ. 260 వరకు వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా ధర దిగివచ్చింది. అయితే ఇప్పుడు యాపిల్ వంతు వచ్చినట్లు మార్కెట్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యాపిల్ ధరలు క్రమంగా కొండెక్కనున్నాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుటికే యాపిల్స్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. యాపిల్ తోటలకు హిమాచల్ ప్రదేశ్ చాలా ఫేమస్. అయితే ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జనావాసాలు చెరువులను తలపించాయి. రోడ్లు నదుల్లా మారాయి. భారీ వర్షాల ధాటికి తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ఈ అతి భారీ వర్షాల కారణంగా యాపిల్ తోటలు కూడా నాశనం అయ్యాయి. చేతికొచ్చిన పంట నీటి పాలు అయింది. చాలా ప్రాంతాల్లో యాపిల్ తోటలు, వరి చెనులా నీటితో నిండిపోయాయి. దీని వల్ల యాపిల్ దిగుబడి భారీగా పడిపోయింది. మరోవైపు కొండచరియలు విరిగిపడటం, రోడ్లు తెగిపోవడం, వంతెనలు కూలిపోవడంతో రోడ్డు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాంతో పాటు భారీ వర్షాల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. ఢిల్లీ హోల్‌సేల్‌ మార్కెట్ కు ప్రతీరోజు యాపిల్స్ తీసుకువచ్చే వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.


భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి, పెరిగిన ధర


హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల మార్కెట్లకు యాపిల్ రాక చాలా తగ్గిపోయింది. చాలా ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అలాగే కోత పండ్లు కూడా తేమ వాతావరణం కారణంగా త్వరగా చెడిపోయే పరిస్థితి. పళ్లు, కూరగాయులు త్వరగా పాడైపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ తో పాటు ప్లమ్స్, ఆప్రికాట్స్, పలు రకాల పూలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. సాధారణంగా ఢిల్లీ హోల్ సేల్ మార్కెట్లో బాక్స్ యాపిల్స్ ధర రూ. 1000 వరకు ఉంటుంది. ప్రస్తుతం బాక్స్ యాపిల్స్ ధర రూ.2500 నుంచి రూ. 3500 వరకు పలుకుతోంది. 


Also Read: First Biodiversity Village: దేశంలోనే తొలి జీవవైవిధ్య గ్రామం అట్లాస్ లాంచ్ చేసిన గోవా సర్కారు


హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అన్ని ప్ర‌ధాన న‌దులు పొంగి పొర్లుతున్నాయి. ప‌రిస్థితి దారుణంగా ఉంది. హిమాల‌యాల్లో ఉన్న న‌దుల‌న్నీ ఉగ్ర‌రూపం దాల్చాయి. మ‌నాలి వ‌ద్ద ఉన్న బియాస్ న‌ది ఉప్పొంగుతోంది. వేగంగా ప్ర‌వ‌హిస్తున్న ఆ న‌ది ధాటికి.. టూరిస్టుల‌కు చెందిన కార్ల‌న్నీ కొట్టుకుపోతున్నాయి. మ‌నాలిలో బియాస్ న‌ది స‌మీపంలో పార్క్ చేసిన కార్ల‌న్నీ ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయి. నీరు, బుర‌ద ఒక్క‌సారిగా కొట్టుకు రావ‌డంతో.. కార్లు కూడా ఆ బుర‌ద నీటిలోనే మాయం అయ్యాయి. వ‌ర్షాలు.. వ‌ర‌ద‌లు.. కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం వ‌ల్ల‌.. హిమాచ‌ల్‌లో ఇప్ప‌టికే 19 మంది మృతిచెందారు.