చంద్రయాన్ 3 లోని ల్యాండర్ మాడ్యుల్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి గురువారం (ఆగస్టు 17) విజయవంతంగా విడిపోయింది. ఇక ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ శుక్రవారం చంద్రుని చుట్టూ తిరుగుతూ ఇంకొంచెం తక్కువ కక్ష్యలో దిగుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్‌లో ల్యాండర్, రోవర్ ఉండే సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో ఇప్పటివరకు ప్రయాణం ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా జరిగింది. ఇప్పుడు ఇక ల్యాండర్ ముందుకు సాగాల్సి ఉంది. విడిపోయేటప్పుడు ‘థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్’ అని ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ కి చెప్పినట్లుగా ఇస్రో వెల్లడించింది. సపరేషన్ అనేది చంద్రుడి 153x163 కిలో మీటర్ల కక్ష్యలో జరిగింది.


ఇక చంద్రుడిపై దిగడానికి కేవలం 100 కిమీ దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇకపై ల్యాండర్ వేగం, ఎత్తును తగ్గించాల్సి ఉంటుంది. ల్యాండర్ చంద్రుని చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కక్ష మరింతగా తగ్గిస్తారు. ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగస్ట్ 23 సాయంత్రం 6 గంటలకు ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది.


ఇది ల్యాండర్ యొక్క తర్వాతి దశ


డిఆర్బిటింగ్ ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను 30 కి.మీ పెరిలూన్, 100 కి.మీ అపోలూన్ కక్ష్యలో ఉంచడం ఈ మిషన్‌లో తర్వాతి దశ. ఇది ఆగస్టు 18, 20 తేదీలలో జరుగుతుంది. పెరిలున్ అంటే చంద్రుని ఉపరితలం నుండి తక్కువ దూరం. అపోలున్ అంటే చంద్రుని ఉపరితలం నుండి ఎక్కువ దూరం. 


ల్యాండర్ వేగం, ఎత్తు (Alititude) ఎలా తగ్గుతుంది?


విక్రమ్ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడిపోయిన తర్వాత 30 కి.మీ x 100 కి.మీ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేరుతుంది. ఈ ప్రక్రియ చంద్రుడి చుట్టూ రెండుసార్లు తిరగడం ద్వారా జరుగుతుంది. ఈ సమయంలో, ల్యాండర్ ఎత్తును, వేగాన్ని తగ్గించడానికి దాని ఇంజన్లను మండిస్తారు. అంటే అవి వ్యతిరేక దిశలో మండడం వల్ల ల్యాండర్ నెమ్మది అవుతుంది. ల్యాండర్ 30 కిమీ x 100 కిమీ కక్ష్యలోకి వచ్చిన తర్వాత, సాఫ్ట్ ల్యాండింగ్ దశ ప్రారంభమవుతుంది. ఇదే చాలా కీలకమైన అంశం. ఇస్రోకు ఇది అత్యంత కష్టతరమైన దశ ఇది. గత చంద్రయాన్ 2 ప్రయోగంలో విఫలం జరిగింది ఇక్కడే. చంద్రుడికి 30 కి.మీ ఎత్తులో విక్రమ్ స్పీడ్ తగ్గిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగాల్సి ఉంటుంది.  చంద్రుడిని తాకే సమయంలో ల్యాండర్‌ వర్టికల్ వెలాసిటీ సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వెలాసిటీ సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూస్తున్నారు.