ITR filing: 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ లేదా 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కోసం ITR ఫైల్ చేసే గడువు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. లేట్ ఫైన్‌తో కలిపి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసే పని జులై 31 తర్వాత కూడా కొనసాగుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఐటీ రిటర్నులు దాఖలయినా... ఈసారి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బంగాల్ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఈ ఐదు రాష్ట్రాలు టాప్-5 స్టేట్స్‌గా నిలిచాయి. లైవ్‌మింట్ రిపోర్ట్ ప్రకారం, 2023 అసెస్‌మెంట్ సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్‌లలో, ఈ 5 రాష్ట్రాల వాటానే 48 శాతం (దాదాపు సగం).
మొత్తమ్మీద, 2022 అసెస్‌మెంట్ సంవత్సరంతో పోలిస్తే 2023 అసెస్‌మెంట్ సంవత్సరంలో 64 లక్షల ఐటీఆర్‌లు ఎక్కువగా దాఖలయ్యాయి. రిటర్న్‌ల విషయంలో మహారాష్ట్ర టాప్-1 ర్యాంక్‌లో ఉంది, అత్యధిక సంఖ్యలో ఆదాయపు పన్ను రిటర్నులు ఈ రాష్ట్రం నుంచే దాఖలయ్యాయి. ఆ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ పేర్లు ఉన్నాయి.
రిటర్న్‌ల దాఖలులో వృద్ధి పరంగా చూస్తే... ఆశ్చర్యకరంగా, ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్, మిజోరం, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఐటీఆర్ ఫైలింగ్స్ గత 9 సంవత్సరాల్లో 20 శాతం పెరిగాయి.
2047 నాటికి దేశంలో పరిస్థితి ఇలా ఉండొచ్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం... దేశంలో ప్రజల ఆదాయం పెరిగింది. తక్కువ ఆదాయ వర్గం నుంచి అధిక ఆదాయ వర్గానికి మారిన పన్ను చెల్లింపుదార్ల సంఖ్య భారీగా పెరిగింది. 2047 నాటికి, మధ్య తరగతి వార్షిక ఆదాయం రూ. 50 లక్షలకు చేరుతుందని SBI తన రిపోర్ట్‌లో చెప్పింది. దేశంలో ITR ఫైలింగ్‌లో ట్రెండ్స్, మార్పులకు సంబంధించి 'Deciphering Emerging Trends in ITR Filing' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. భారతదేశ పన్ను వ్యవస్థలో నిరంతర మార్పుల గురించి కూడా ఈ నివేదిక వెల్లడించింది.
6.86 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు
ఐటీ రిటర్నుల దాఖలుకు ఈ ఏడాది లాస్ట్ డేట్ (జులై 31) ముగిసే సమయానికి, దేశవ్యాప్తంగా 6.77 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదార్లు రిటర్న్‌లు సబ్మిట్ చేశారు. వీళ్లలో 53.67 లక్షల మంది మొదటిసారిగా ఆదాయపు పన్ను వివరాలు సమర్పించారు. తుది గడువులోగా రిటర్న్ సబ్మిట్ చేయనివాళ్లకు, లేట్ ఫైన్‌తో కలిపి బీలేటెడ్ ఐటీఆర్ (Belated ITR) ఫైల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు దీనికి అవకాశం ఉంది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు (ఆగస్టు 17, 2023), దాదాపు 6.86 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేశారు.
₹కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న టాక్స్ పేయర్ల సంఖ్య
మన దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్య చాలా వేగంగా పెరిగినట్లు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌లో (2021-22 ఆర్థిక సంవత్సరం) ITR ఫైల్ చేసిన వాళ్లలో ఒక కోటి రూపాయలకు పైగా ఆదాయాన్ని ప్రకటించిన టాక్స్ పేయర్ల (వ్యక్తులు, కంపెనీలు, ట్రస్టులు) సంఖ్య 2.69 లక్షలు. వీళ్లలో ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్లు (వ్యక్తులు) 1,69,890 మంది. 2021--22 అసెస్‌మెంట్ ఇయర్‌లో 1,14,446 మంది, 2020-21 మదింపు సంవత్సరంలో 81,653 మంది కోటి రూపాయలకు మించి ఆదాయాన్ని ప్రకటించారు. ఈ విధంగా, గత 2 సంవత్సరాల్లోనే (2020-21 అసెస్‌మెంట్ ఇయర్ - 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ మధ్య కాలంలో) ఒక కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న టాక్స్ పేయర్ల సంఖ్య 81,653 నుంచి 1,69,890కు, రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్ మళ్లీ వచ్చిందోచ్, ₹5 లక్షలకు ₹43,000 వడ్డీ మీ సొంతం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial