Italy Floods:
ఇటలీలో బురద తుఫాను..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో వింతవింత విపత్తులను చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటలీలోని బర్డోనేషియాలో మెర్డొవైన్ నది (River Merdovine) ఉన్నట్టుండి ఉప్పొంగింది. తీరం దాటి నగరంలోకి చొచ్చుకొచ్చింది. హఠాత్తుగా రోడ్లను చీల్చుకుని బయటకు వచ్చింది. ఎవరూ ఊహించని బురద తుఫాను (Mud Storm) అక్కడి ప్రజల్ని సతమతం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ టౌన్ అంతా బురదమయమైపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చెట్ట దగ్గర వింత శబ్దాలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై కొందరు ముందుకు పరిగెత్తారు. అలా పరిగెత్తిన క్షణాల్లోనే చెట్టు కింద నుంచి భారీ మొత్తంలో బురద బయటకు వచ్చింది. ఈ ధాటికి రోడ్డు ధ్వంసమైపోయింది. ఎక్కడికక్కడే చెట్లు కూలిపోతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన కారణంగా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. కొండ చరియలు కూడా భారీగా విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ బురద తుఫాను కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెబుతున్నారు. ఆస్తినష్టం మాత్రం భారీగానే నమోదైంది. ఈ తుఫాను కారణంగా అధికారులు వెంటనే 120 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్కూ టీమ్స్ రంగంలోకి దిగాయి. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...టౌన్‌లోని కార్లు వీధులు బురదతో నిండిపోయాయి. ఎప్పటికప్పుడు బురదను తొలగిస్తున్నప్పటికీ...తుఫాను ధాటికి మళ్లీ వచ్చి చేరుతోంది.
స్థానిక గవర్నర్ ఒకరు ఫేస్‌బుక్‌లో ఈ విపత్తుకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేశారు. బర్డోనేషియాలో స్టేట్ ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
"బర్డోనేషియాలో స్టేట్ ఎమర్జెన్సీ పెట్టాలన్న రిక్వెస్ట్‌ని నేను అంగీకరించాను. వెంటనే దానిపై సంతకం చేశాను. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ ఈ తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాకపోతే మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పబ్లిక్ బిల్డింగ్‌లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రైవేట్ బిల్డింగ్‌లు, కార్‌లకూ నష్టం వాటిల్లింది"
- స్థానిక గవర్నర్
పీడ్‌మాంట్ ప్రాంతంలో ఉన్న బర్డోనేషియా మంచి పర్యాటక ప్రదేశం. ఎండాకాలం, శీతాకాలంలో ఎక్కువ సందడిగా ఉంటుంది. పర్వతాల మధ్య ఉండడం వల్ల అందంగా కనిపించినా...వాతావరణ మార్పుల ప్రభావానికీ గురవుతూ ఉంటుంది.