Cough Syrup Case:
కోర్టులో విచారణ..
ఇండియాకి చెందిన కాఫ్ సిరప్ కారణంగా ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వాదనలు, ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఇప్పటికో ఆయా కంపెనీల ఫ్యాక్టరీలను మూసివేసింది. కేసులు కూడా నమోదు చేసింది. విచారణ కొనసాగుతుండగానే...ఉజ్బెకిస్థాన్ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో వాదించే క్రమంలో భారత్‌పై మండి పడ్డారు. తమ దేశంలో 65 మంది చిన్నారులు చనిపోవడానికి కారణం అవినీతే అని తేల్చి చెప్పారు. స్థానిక ఆరోగ్య అధికారులకు 33 వేల డాలర్లు లంచంగా ఇచ్చి మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారని వాదించారు. ఫలితంగానే...ఎలాంటి టెస్ట్‌లు లేకుండానే ఆ సిరప్‌లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. భారత్‌కి చెందిన Marion Biotech కంపెనీ ఈ సిరప్‌లు తయారు చేసింది. ఇప్పటికే ఈ మరణాలతో సంబంధం ఉన్న 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో 20 మంది స్థానికులు కాగా...ఇండియాకి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. పన్ను ఎగవేత, నిర్లక్ష్యం, లంచగొండితనం..ఇలా పలు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని Quramax Medical కంపెనీ ఈ సిరప్‌లను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఈ కంపెనీ సీఈవో కోర్టులో గట్టిగా వాదించాడు. అధికారులు వేల డాలర్ల లంచం తీసుకుని అనుమతినిచ్చారని ఆరోపించాడు. తప్పనిసరిగా చేయాల్సిన క్వాలిటీ టెస్ట్‌లను అందుకే స్కిప్ చేశారని చెప్పాడు. ఆరోగ్యాధికారులకు లంచం ఇచ్చినట్టు కోర్టుకి వివరించాడు. అయితే..ఆ డబ్బుని వాళ్లు ఎందుకోసం వినియోగించారన్నది మాత్రం తనకు తెలియదని వెల్లడించాడు. ఇండియా నుంచి ఉజ్బెకిస్థాన్‌కి సింగపూర్ మీదుగా సిరప్‌లు సప్లై చేసినట్టు విచారణలో తేలింది.
లైసెన్స్ రద్దు..
ఈ ఏడాది మార్చిలో నోయిడాకు చెందిన Marion Biotech కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ కేంద్రం యూపీ డ్రగ్ కంట్రోలింగ్ అండ్ లైసెన్స్ అథారిటీకీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన కాఫ్ సిరప్ వల్ల ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం చాలా సీరియస్‌గా ఉంది. WHO ఈ ఆరోపణలు చేసిన వెంటనే అప్రమత్తమై విచారణ మొదలు పెట్టింది. ఆ తరవాత ఆ సంస్థకు చెందిన తయారీ ల్యాబ్‌లను మూసేసింది. ఆ శాంపిల్స్‌ను సేకరించింది. మొత్తం 36 డ్రగ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన అధికారులు అందులో 22 శాంపిల్స్‌లో టాక్సిన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఈ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. అయితే మరో ఇండియన్ కంపెనీ Maiden Pharmaceuticals తయారు చేసిన సిరప్‌ల కారణంగా ఈ మరణాలు సంభవించాయన్న వాదన కూడా ఉంది. ఇదే విషయాన్ని WHO వెల్లడించింది. ఈ సిరప్ శాంపిల్స్‌ని టెస్ట్ చేయగా వాటిలో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించింది. ఉజ్బెకిస్థాన్‌తో పాటు కిర్జిస్థాన్, కంబోడియాకు కూడా ఇవే సిరప్‌లను ఎగుమతి చేస్తున్నట్టు తేలింది.
Also Read: Chandrayaan-3: స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విడిపోనున్న ల్యాండర్ విక్రమ్, నేడే కీలక దశ