Exams In 15 Languages:



15 స్థానిక భాషల్లో..


కేంద్రమంత్రి జితేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షలను 15 భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల విషయంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ని సులభతరం చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. భాష కారణంగా ఎవరూ ఈ పరీక్షలు రాయకుండా ఆగిపోకూడదని అన్నారు. 14వ Hindi Consultative Committee కమిటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 13 స్థానిక భాషల్లో SSC రాత పరీక్ష నిర్వహించనున్నారు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురీ, కొంకణి భాషల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. 


"SSC పరీక్షల్ని 15 భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పరీక్షలు రాయాలనుకునే వారికి భాష అడ్డంకిగా మారకూడదు. ఇదే మా లక్ష్యం కూడా. స్థానిక భాషల్ని ప్రోత్సహించే విషయంలో గత 9 ఏళ్లలో చాలా అభివృద్ధి సాధించాం. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ చొరవ వల్లే సాధ్యమైంది. హిందీతో పాటు అన్ని భాషలకి సముచిత ప్రాధాన్యత దక్కాలన్నదే మా లక్ష్యం. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్‌ కూడా సులభతరమవుతుంది. ఎప్పటి నుంచో చాలా రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉంది. Official Language Rules, 1976 పాలసీని రివ్యూ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశాం. గత ఐదారేళ్లుగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే 22 భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం"


- జితేంద్ర సింగ్, కేంద్రమంత్రి


ఎంబీబీఎస్ హిందీ కోర్స్..


ఇప్పటికే JEE, NEET, UGC పరీక్షల్ని 12 భాషల్లో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు జితేంద్ర సింగ్. యూపీఎస్‌సీకి సంబంధించి సబ్జెక్ట్ బుక్స్‌ని కూడా స్థానిక భాషల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తొలిసారి MBBS కోర్స్‌ని హిందీలో లాంఛ్ చేశారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ ఇదే అందుబాటులోకి వచ్చింది.