తాలిబన్లు దాదాపు రెండు దశాబ్దాల తరువాత అఫ్గానిస్థాన్‌పై పట్టు సాధించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రాణ భయంతో విదేశాలకు పారిపోవడంతో తాలిబన్లు ఎలాంటి రక్తపాతం లేకుండా దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. అయితే పంజ్ షీర్ లాంటి కొన్ని ప్రాంతాలు మాత్రం తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారాయి. పంజ్ షీర్ లోయను తమ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 


తాలిబన్ల సీనియర్ కమాండర్ మౌల్వీ ఫసియుద్దీన్ ను నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ హతం చేశాయి. పంజ్ షీర్ లోయను వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్న తాలిబన్లపై రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఎదురుదాడికి దిగి ఫసియుద్దీన్‌ను, అతడికి రక్షణగా మరో 12 మంది వరకు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఈశాన్య అఫ్గానిస్థాన్ గ్రూప్ చీఫ్‌గా కీలక పదవిలో ఉన్న సీనియర్ కమాండర్ ఫసియుద్దీన్ మరణం వారికి కోలుకోలేని దెబ్బ. మరోవైపు పాకిస్తాన్, చైనా దేశాల ప్రతినిధులను అప్గాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఆహ్వానించడం ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో మౌల్వీ ఫసియుద్దీన్ లాంటి కీలక నేత హతం కావడంతో తాలిబన్లు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.


Also Read: తాలిబన్ల వశమైన 'పంజ్ షీర్'.. ఖండించిన ఎన్ఆర్ఎఫ్


అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వైదొలగిన అనంతరం పంజ్ షీర్ వ్యాలీ వైపు తాలిబన్లు వేగంగా పావులు కదుపుతున్నారు. కానీ ఈ క్రమంలో వందల కొద్దీ తాలిబన్లు పంజ్ షీర్‌లో హతమయ్యారని కథనాలు వచ్చాయి. మరోవైపు పంజ్ షీర్ తమ వశం అయిందని సైతం తాలిబన్లు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. దీనిపై నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ స్పందించి వివరణ ఇచ్చింది. పంజ్ షీర్ లోయను తమ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసిన తాలిబన్లపై తాము ఎదురుదాడికి దిగామని.. ఈ నేపథ్యంలో 700 మంది వరకు తాలిబన్లు హతమయ్యారని ఎన్‌ఆర్ఎఫ్ స్పష్టం చేసింది.


Also Read: Taliban Crisis News: తాలిబన్ల సూపర్ స్పీడ్.. ఆ రోజు చీఫ్ గెస్ట్ లుగా పాక్, చైనా 


తుదిశ్వాస వరకు పోరాటం..
తాలిబన్లకు పంజ్ షీర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని రెసిస్టెన్స్ ఫోర్సెస్ నేత అహ్మద్ మసూద్ అన్నారు. తాలిబన్ల దాడులను తమ బలగాలు తిప్పికొడుతున్నాయని.. తాను తుది శ్వాస విడిచే వరకు పంజ్ షీర్ కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే తాలిబన్లకు పాకిస్తాన్ సాయం అందిస్తూ, కుయుక్తులు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తాలిబన్ల లాంటి దుర్మార్గులతో పోరాటానికి కలిసికట్టుగా ముందుకు రావాలని అఫ్గాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.


Also Read: ఆధార్ కార్డ్‌లో వివరాలు అప్‌డేట్ చేస్తున్నారా.. ఈ కొత్త రూల్ తెలుసుకోండి