అటార్నీ జనరల్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఓ లేఖ అందింది. ఓ మహిళ భవనంలో బందీగా ఉందని.. రక్షించకపోతే ఆమె ఏ క్షణంలోనైనా చనిపోవచ్చనేది ఆ లేఖ సారంశం. అయితే, పోలీసులు అది సాధారణ కేసుగా భావించారు. ఎందుకంటే ఆ ఇంట్లో నివసిస్తున్న తండ్రి, కొడుకులు ఆర్థికరమైన ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నారు. ఆ ఇంట్లో ఇలాంటి ఘటన జరుగుతుందా అనే సందేహం వారిలో ఉంది. అటార్ని జనరల్ ఆదేశాలు కాదనలేక ఆ ఇంట్లో సోదాలకు వెళ్లారు. ఇల్లంతా బాగానే ఉంది. కానీ, ఓ గది మాత్రం తాళం వేసి ఉంది. ఆ గది ఎందుకు తాళం వేసి ఉందని పోలీసులు ఆ ఇంట్లో ఉంటున్న మహిళను ప్రశ్నించారు. అది స్టోర్ రూమ్ అని చెప్పింది. ఎందుకో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ గదిని సమీపిస్తున్న కొద్ది.. ముక్కు పుటలు అదిరేంత వాసన వస్తోంది. దీంతో పోలీసులు ఆ గది తలుపులు పగలగొట్టి చూశారు. 


ఆ గదిలోకి వెళ్లగానే పోలీసుల దిమ్మ తిరిగింది. దుమ్ము పట్టిన కర్టెన్లు, చెత్త చెదారంతో నిండిపోయిన ఆ గదిలో ఒక మూలన మాసిన దుప్పట్లో ఓ వింత ఆకారం కనిపించింది. దాన్ని చూడగానే అస్థిపంజరం అనుకున్నారు. కానీ, అది ఓ మహిళ. ఆహారం లేక బక్కచిక్కిపోయి.. వెర్రి చూపులు చూస్తున్న ఆమె దయనీయ పరిస్థితి చూసి పోలీసులకూ జాలేసింది. నామరూపల్లేని పరుపుపై నగ్నంగా పడివున్న ఆమెకు దుప్పటి చుట్టి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు ఈ గతి పట్టించినది మరెవ్వరో కాదు, స్వయంగా ఆమె తల్లి, సోదరుడు. పాతికేళ్లుగా ఆమె ఆ చీకటిలో నరకం చూస్తున్నా.. ఆ కన్న తల్లి మనసు కరగలేదు. బాధ్యతాయుత న్యాయవాది పదవిలో ఉన్న సోదరుడు సైతం చలించలేదు. ఆమెపై వారు ఎందుకంత కక్ష పెట్టుకున్నారు? ఆమె ఏం చేసిందని ఆ గదిలో బంధించారో తెలియాలంటే.. సుమారు శతాబ్దం కిందటి ఈ దారుణ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. 


అది 1876వ సంతవత్సరం. ఫ్రాన్స్‌లోని వియన్నేకు చెందిన బ్లాంచే మోనియర్ అనే పాతికేళ్ల యువతి ఓ వ్యక్తిని ప్రేమించి.. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, బ్లాంచేకు తండ్రి లేడు. దీంతో ఆమె బాగోగులను తల్లి మేడమ్ మోనియర్ భరిస్తోంది. దీంతో బ్లాంచే తన ప్రియుడిని తల్లికి పరిచయం చేసింది. అయితే, మోనియర్‌కు నచ్చలేదు. అతడికి ఆస్తిపాస్తులు లేవనే కారణంతో ఇద్దరికీ పెళ్లి చేయడం కష్టమని చెప్పేసింది. పైగా బ్లాంచే అందగత్తె కావడంతో తప్పకుండా ఉన్నత కుటుంబంలోని వ్యక్తి ఆమెను వరిస్తాడని మోనియర్ భావించేది. అయితే, బ్లాంచే మాత్రం తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని మొండి కేసింది. తల్లి తెచ్చిన సంబంధాలను తిరస్కరించేది.   


తనకు డబ్బు కంటే ప్రేమే ముఖ్యమని బ్లాంచే తేల్చి చెప్పింది. ఆ మాట తల్లికి అస్సలు నచ్చలేదు. దీంతో ఆమె తన కుమారుడు మార్సెల్‌తో కలిసి బ్లాంచెను వారి ఇంట్లోని పై అంతస్తులోని ఓ గదిలో బంధించారు. కిటికీలన్నీ మూసేసి మంచానికి సంకెళ్లు వేశారు. చివరికి మలమూత్రాలు విసర్జించేందుకు కూడా విడిచిపెట్టేవారు కాదు. తనని విడిపించాలని గట్టిగా కేకలు పెట్టేది. ఓ రోజు ఆమె అరుపులు విని.. ఏం జరిగిందని మోనియర్‌ను అడిగారు. తన కూతురికి మతిబ్రమించిందని, చికిత్స చేయిస్తున్నామని చెప్పింది. చివరికి ఆమె చనిపోయినట్లుగా నటించారు.


అప్పటి నుంచి ఆ ఇంట్లో తల్లి, కొడుకులు మాత్రమే ఉంటున్నారని అంతా భావించారు. కానీ, చీకటి గదిలో బ్లాంచే నరకం చూసింది. టాయిలెట్ సదుపాయం లేకపోవడంతో ఆ గదిలోనే మలమూత్రాలను విసర్జించేది. అక్కడే ఆహారాన్ని తినేది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆ గదిని శుభ్రం చేయలేదు. దీంతో ఆ గది ఓ చెత్తకుప్పలా మారింది. తన విసర్జన కంపును భరిస్తూనే.. ఆమె తన ఆహారాన్ని తీసుకొనేది. కొన్నాళ్లకు ఆమెకు ఆహారం మీద విరక్తి పుట్టింది. తిండి తినడం మానేసింది. అలా ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. కానీ, ఒక్క రోజు కూడా తల్లి, సోదరుడు ఆమె బతికి ఉందా.. లేదా చనిపోయిందా అని తెలుసుకోడానికి కూడా ప్రయత్నించలేదు. అప్పుడు వేసిన గడియా అలాగే ఉంది. తలుపు కింద నుంచి ఖైదీకి ఆహారం పెట్టినట్లు ప్లేట్లను తోసేవారు. చెత్త చెదారం పేరుకోవడం, మలమూత్రాల నిండిపోవడం వల్ల ఆ గది మొత్తం పురుగులతో నిండిపోయింది. అవి తలుపు కింద నుంచి బయటకు వస్తున్నా.. తల్లి స్పందించలేదు. గుడ్డలు అడ్డుపెట్టి.. ఆ గదిలోని వాసన బయటకు రాకుండా ప్రయత్నించేవారు. బ్లాంచేను బంధించిన పై అంతస్తులోకి తల్లి, కొడుకులు వెళ్లేవారు కాదు. అలా పాతికేళ్లు ఆమెను ఆ గదిలోనే వదిలేశారు. ఆమె అక్కడే కుళ్లి చనిపోవాలనేది వారి ప్లాన్.


Also Read: ఆ దేశంలో సెక్స్ బంద్.. ఇక శృంగారం చేయరాదని మహిళలకు పిలుపు.. ప్రభుత్వంపై వింత నిరసన!


ఆమె ఉన్న గది మొత్తం కీటకాలు, ఎలుకలతో నిండిపోయింది. అవి కరుస్తుంటే.. గట్టిగా అరిచే ఓపిక కూడా ఆమెకు లేదు. బరువు తగ్గిపోయి.. బక్క చిక్కిపోయి.. ప్రాణం ఉన్న శవంలా మారింది. శరీరంలో కొన్ని భాగాలకు పుండ్లు ఏర్పడి కుళ్లిపోయింది. ఆమె దాదాపు 50 పౌండ్ల బరువు తగ్గిపోయింది. కాలక్రమేనా ఆమెకు మతిబ్రమించింది. మాట్లాడటం కూడా మరిచిపోయింది. పాతికేళ్లు గడిచిన తర్వాత 1901, మే 23న అటార్నీ జనరల్‌కు ఓ రహస్య లేఖ అందింది. ఆ ఇంట్లో ఓ మహిళ చావుబతుకుల్లో ఉందని అందులో ఉంది. దీంతో అటార్నీ జనరల్ ఆ లేఖను పోలీసులకు పంపి సోదాలు జరిపించారు. అలా 25 ఏళ్ల తర్వాత బ్లాంచే బాహ్య ప్రపంచాన్ని చూసింది. కానీ, ఆనందించేందుకు ఆమె మతిస్థిమితం లేదు. పాతికేళ్లుగా సూర్యరశ్మిని చూడకపోవడం వల్ల కళ్లు తెరవలేకపోయింది. తనకు జరిగిన ఘోరాన్ని చెప్పేందుకు నోరు కూడా తెరవలేకపోయింది. హాస్పిటల్‌లో చికిత్స తర్వాత ఆమె క్రమేనా కోలుకుంది. కానీ, వస్తువులను గుర్తించడం మొదలుపెట్టింది.


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?


బ్లాంచేను రక్షించేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘ఆ తలుపులు తెరిచిన వెంటనే.. కుళ్లిన గడ్డిలాంటి పరుపు ఉన్న మంచం మీద ఆమె నగ్నంగా పడి ఉంది. ఆమె చుట్టూ విసర్జనలు, కుళ్లిన మాంసం ముక్కలు, చేపలు, రొట్టెలు, కూరగాయాలు ఉన్నాయి. ఆ గదిలో గాలి పీల్చడం కూడా కష్టంగా అనిపించింది. అందువల్ల ఆ గదిలో మేం ఎక్కువ సేపు ఉండలేకపోయాం’’ అని తెలిపారు. బ్లాంచేను రక్షించిన తర్వాత పోలీసులు తల్లి మోనియర్‌ను, సోదరుడు మార్సెల్‌ను అరెస్టు చేశారు. ఆ గది నుంచి బయటపడిన తర్వాత బ్లాంచే దాదాపు 16 సంవత్సరాలు జీవించింది. ఈ ఘటన తర్వాత ఫ్రాన్స్‌లో ఆమెను ‘లా సాక్వెస్ట్రీ డి పొయిటీర్స్’ అని పిలిచేవారు. 1913లో ఓ మానసిక వైద్యశాలలో బ్లాంచే మరణించింది. ఆమెకు నరకం చూపిన తల్లి మోనియర్.. అరెస్టయిన 15 రోజుల్లోనే గుండెపోటుతో చనిపోయింది. ఆమె సోదరుడు మార్సెల్‌కు కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. అయితే, అతడు లాయర్ కావడం వల్ల చట్టంలో లోసుగులను ఉపయోగించుకుని బయటపడ్డాడు. అయితే, ఈ ఘటన తర్వాత అతడి జీవితం దుర్భరమైంది. మరోచోట తలదాచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 


Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్